హ‌మ్మ‌య్య‌.. వాళ్ల కోసం ఫ్లైట్లు - షిప్పులు సిద్ధం!

Update: 2020-05-04 17:32 GMT
లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారో ఏమో కానీ.. వేరే రాష్ట్రాల్లో - దేశాల్లో చిక్కుకుపోయి స్వ‌స్థ‌లాల‌కు రాలేక‌పోతున్న వారి వేద‌న వ‌ర్ణ‌నాతీతంగా ఉంది. కొన్ని వంద‌ల కిలోమీట‌ర్ల అవ‌త‌ల ఉన్న వాళ్లే రాష్ట్రాల బోర్డ‌ర్లు దాటి త‌మ ప్రాంతాల‌కు రాలేక‌పోతున్నారు. ఇక వేరే దేశాల్లో చిక్కుకున్న వారి ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌ని లేదు. విదేశాల్లో ప్రాణాలు అర‌చేతుల్లో పెట్టుకుని ఎప్పుడెప్పుడు స్వ‌దేశాల‌కు వెళ్తామా అని వేలాది మంది ఎదురు చూస్తున్నారు. ఐతే అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల్ని కొన్ని నెల‌ల పాటు పున‌రుద్ధ‌రించే ప‌రిస్థితి లేకపోవ‌డంతో వారిలో అంత‌కంత‌కూ ఆందోళ‌న పెరిగిపోతోంది. ఐతే అర్జెంటుగా స్వ‌దేశానికి వ‌చ్చేయాల‌ని చూస్తున్న ఎన్నారైల‌కు ఊర‌ట‌నిస్తూ వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసింది.

అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల్ని పున‌రుద్ధ‌రించ‌కుండానే విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల్ని స్వ‌దేశానికి రప్పించ‌డానికి స‌న్నాహాలు చేసింది మోడీ స‌ర్కారు. నాన్-షెడ్యూల్ క‌మ‌ర్షియ‌ల్ ఫ్లైట్ల‌తో పాటు షిప్పుల‌ను ఎన్నారైల కోసం సిద్ధం చేశారు. మే 7 నుంచి వీరిని తీసుకొచ్చే పని మొద‌ల‌వుతుంది. బోర్డింగ్‌ కు ముందు స్క్రీనింగ్ నిర్వ‌హించి క‌రోనా ల‌క్ష‌ణాలు లేని వారినే ప్ర‌యాణాల‌కు అనుమ‌తించ‌నున్నారు. ఇండియాకు వ‌చ్చాక వారి మొబైళ్ల‌లో ఆరోగ్య సేతు యాప్ ఇన్ స్టాల్ చేయించి 14 రోజుల పాటు ప్ర‌భుత్వ క్వారంటైన్ కేంద్రాల్లో పెట్టి ప‌ర్య‌వేక్షిస్తారు. ఆ త‌ర్వాత క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెగెటివ్ వ‌స్తే ఇళ్ల‌కు పంపుతారు. పాజిటివ్ వ‌స్తే ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తారు. మ‌రి ప్ర‌యాణ‌ - ఇత‌ర‌ ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందా.. లేక వారి నుంచి వ‌సూలు చేస్తుందా అన్న‌దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఎలా అయినా స‌రే.. విదేశాల్లో చిక్కుకుని ఇండియాకు రావడం కోసం ఎదురు చూస్తున్న వారికిది గొప్ప ఉప‌శ‌మ‌న‌మే.
Tags:    

Similar News