ప్రముఖ జర్నలిస్టును కెలికిన కమెడియన్.. బ్యాన్ మీద బ్యాన్

Update: 2020-01-30 14:30 GMT
కమెడియన్ కమ్ కామ్రేడ్ అయిన కునాల్ కమ్రా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వాక్ స్వాంత్యంత్రం పేరుతో తమకు తగినట్లుగా వాదనలు వినిపించే సగటు కమ్యునిస్టులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్యవహరించే గుణం ఉన్న నటుడు కునాల్.. ఈ మధ్యన ముంబయి - లక్నో మధ్య నడిచే ఇండిగో విమానంలో తన సహ ప్రయాణికుడైన ప్రముఖ జర్నలిస్ట అర్నబ్ గోస్వామి పట్ల దురుసుగా ప్రవర్తించారు.

ఈ వ్యవహారంపై కన్నెర్ర చేసిన పలు విమానయాన సంస్థలు ఒకటి తర్వాత ఒకటి చొప్పున కునాల్ మీద నిషేధాన్ని విధిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో స్పెస్ జెట్ సంస్థ చేరింది. దీనిపై కునాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఇగోను హర్ట్ చేయటమే తన తప్పా? అని ప్రశ్నిస్తున్న ఆయన రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని కూడా వినియోగించుకోకూడదా? అంటూ పెడసరపు వాదనను వినిపిస్తున్నారు.

నిజమే.. రాజ్యాంగం వాక్ స్వాతంత్య్రం ఇచ్చింది. అలా అని ఇష్టమొచ్చినట్లుగా.. కోపం ఉన్న ప్రతి ఒక్కరి విషయంలోనూ దురుసుగా వ్యవహరించటమే హక్కా? అన్న ప్రశ్నకు కునాల్ మాష్టారు సమాధానం చెప్పటం లేదు. కానీ.. తనపై నిషేధం విధిస్తున్న విమానయాన సంస్థల తీరుపై ఆయన స్పందిస్తూ ప్రధాని మోడీపై వ్యంగ్య వ్యాఖ్యల్ని సంధిస్తున్నారు. మోడీజీ రోడ్డు మీద అయినా నడిచి వెళ్లొచ్చా? దానిపై కూడా నిషేధాన్ని విధిస్తారా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

చేసిన ఎదవ పని గురించి చింత లేకుండా.. ఈ దేశంలో తామేం చేసినా సరిగానే చేస్తామన్నట్లుగా వ్యవహరించే ధోరణి కమ్యునిస్టులకు కాస్త ఎక్కువన్న అభిప్రాయానికి బలం చేకూర్చేలా కునాల్ తీరు ఉందంటున్నారు. తాను ఇండిగో విమానంలో ఎవరికీ ఇబ్బంది కలిగించలేదన్న ఆయన.. ఒక జర్నలిస్టు ఇగోను హర్ట్ చేయటం తప్పా? అని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు అయినా.. మరెవరైనా సరే.. సమయం.. సందర్భం లేకుండా ఎడాపెడా విరుచుకుపడతామంటే అందరూ చూస్తుండాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే.. కునాల్ తరఫున వాదించే వారికి కొదవ లేదు. కునాల్ చేసిన తప్పును ప్రస్తావించకుండా.. తమ వాదనకు దన్నుగా బీజేపీ నేత ప్రజ్ఞా ఠాగూర్‌ తీరును తెర మీదకు తెస్తున్నారు. ఆ మద్యన స్పైస్ జెట్ విమానంలో సీటు మార్చే ఎపిసోడ్ లో చేసిన రార్థాంతం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజ్ఞా కారణంగా విమానం 45 నిమిషాలు ఆలస్యమైందని.. ఆ లెక్కన చూస్తే కునాల్ విమాన సిబ్బంది పట్ల కానీ తోటి ప్రయాణికుల మీద కానీ దురుసుగా వ్యవహరించలేదని చెబుతూ.. ప్రజ్ఞా మీద చర్యలు ఉండవు కానీ కునాల్ మీద చర్యలు తీసుకుంటారా? అని తప్పు పడుతున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష విధించాలని వాదించటం వేరు.. చేసిన తప్పును సమర్థించుకోవటం కోసం అందుకు వేరే తప్పును ముడి వేయటం చూస్తే.. వామపక్షవాదుల మేథోతనం ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News