రాష్ట్రాల్ని ఏసుకునే బదులు.. జీఎస్టీలోకి తేరెందుకు మోడీజీ?

Update: 2022-04-28 10:30 GMT
చెప్పేటోడికి వినేటోడు ఎప్పుడూ లోకువే. అదే స్థాయిలో అయినా సరే. మనం చెప్పింది వింటారన్న భావన కలిగితే చాలు.. చెలరేగిపోతారు. అందుకు తగ్గట్లే వినాలని డిసైడ్ అయినోళ్లు.. చెప్పేటోళ్ల సుత్తి మొత్తాన్ని వింటారే కానీ.. సూటిగా ప్రశ్నించరు. అదే మనదేశంలోని చాలామందిని దెబ్బ తీస్తున్న పరిస్థితి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అలాంటి తీరునే ప్రదర్శించారు.

దేశాన్ని ఎనిమిదేళ్లుగా పాలించిన మోడీ మాష్టారి పుణ్యమా అని దేశ  ప్రజల బతుకుల్లో ఏం మార్పు వచ్చిందన్న విషయానికి వస్తే.. లీటరు పెట్రోల్.. డీజిల్ కొట్టించాల్సి వచ్చిన ప్రతిసారీ సామాన్యుడు మొదలు సంపన్నుడు సైతం అరే.. ధర బాగా పెరిగిందన్న మాటను అనుకోకుండా ఉండలేని పరిస్థితి.

మోడీ పాలన విషయంలో ఎవరికి ఎలాంటి కంప్లైంట్లు లేనోళ్లు సైతం.. పెట్రోల్.. డీజిల్ విషయంలో మాత్రం.. ఇలా చేసి ఉండాల్సింది కాదన్న భావన చాలామందిలో కనిపిస్తుంది. ఈ సందర్భంగా కరుడుగట్టిన మోడీ సైనికుల్ని.. ఆయన వీరాభిమానులకు మాత్రం మినహాయింపు ఇవ్వాల్సిందే.

ఇంతకూ ఈ విషయాన్ని ఇప్పుడే ఎందుకు ప్రస్తావించటమంటే కారణం లేకపోలేదు. గత ఏడాది నవంబరులో ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని.. దానికి తగ్గట్లే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తాము వసూలు చేసే వ్యాట్ ను తగ్గిస్తే సరిపోయేది కదా? అన్న వాదనను తెర మీదకు తీసుకొస్తూ రాష్ట్రాలను ఇరుకునే పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగానే ప్రధాని మోడీ మాష్టారు.. పెట్రోల్.. డీజిల్ మీద రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్ మీద అభ్యంతరం ఉన్నా.. దాని కారణంగా ప్రజలు ఎక్కువ భారాన్ని మోయాల్సి వచ్చిందన్న ఫీలింగ్ ఉండి ఉంటే.. దాన్ని సెట్ చేయటం ఆయనకు కేవలం గంట పని.

జీఎస్టీ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి.. పెట్రోల్.. డీజిల్ రెండింటిని కూడా వ్యాట్ నుంచి తప్పించి.. జీఎస్టీ విధానంలోకి తీసుకొస్తున్నామని చెప్పి ఏ 5 శాతానికో.. లేదంటే పది శాతం శ్లాబులోకే తెచ్చేస్తే.. పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయి. తాము తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్రాలు ఆదాయం కోల్పోతే..కేంద్రం సర్దుబాటు చేస్తానన్న ఒక్క మాట చెబితే.. ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించే అవకాశమే లేదు.

అదే సమయంలో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద గణనీయమైన రీతిలో ధరలు తగ్గే వీలుంది. అలాంటిది వదిలేసి.. వసూలు చేస్తున్న వ్యాట్ ను తగ్గించుకోవాలని రాష్ట్రాలకు సలహాలు ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్న. రాష్ట్రం ఏదైనా తమకు వచ్చే ఆదాయాన్ని వదులుకునే పరిస్థితులు లేవు. అలాంటి వేళ.. కేంద్రమే చొరవ తీసుకుంటే.. ప్రజల మీద పడుతున్న పెట్రో భారం తప్పుతుంది. చేయాల్సిన పని చేయకుండా.. రాష్ట్రాల్ని ఏదో ఒక మాట అనాలన్న ఆలోచన మోడీని అభాసుపాలు అయ్యేలా చేస్తుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News