విశాఖను ముంచేసిన ఫ్లీట్ రివ్యూ

Update: 2016-02-21 06:21 GMT
58 దేశాలు.... వందలాది యుద్ధ నౌకలు... వేలాది మంది నావికులు... విదేశీ ప్రతినిధులు... భారత రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ సీఎం చంద్రబాబు అందరూ విశాఖలోనే కొలువుదీరిన ప్రపంచ స్థాయి వేడుక ''ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ''. ఫ్లీట్ రివ్యూ నిర్వహణతో విశాఖ ఖ్యాతి ప్రపంచమంతా తెలిసిందని వచ్చినవారంతా పొగిడారు. విశాఖ కార్పొరేషన్ చేసిన ఏర్పాట్లు ఆ స్తాయిలో ఉన్నాయి మరి. అసలే సుందర నగరం.. ఆపై ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం భారీగా ఖర్చుచేసి మరింత సుందరంగా, సౌకర్యవంతంగా మార్చారు. ఇంకేముంది.... వచ్చిన ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే.. విశాఖ అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతవరకు బాగానే ఉంది... ఆ తరువాతే మొదలైంది అసలు కథ. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి వస్తుంది కదా అని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) భారీగా ఖర్చుచేసి ఏర్పాట్లు చేసింది....కానీ, చంద్రబాబు మాత్రం చేసిన ఖర్చులో సగం కూడా ఇవ్వకపోవడంతో ఇప్పుడు జీవీఎంసీ అప్పుల్లో కూరుకుపోయింది అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను ఘనంగా నిర్వహించిన కార్పొరేషన్‌.. ఇప్పుడు ఆ  నిధులు రాబట్టుకునేందుకు సర్కార్‌ వైపు దేహీ అంటూ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీవీఎంసీని ఎవరు ఆదుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. పరిశుభ్రతలో దేశంలోనే ఐదో స్థానం సొంతం చేసుకున్న వైజాగ్‌ కార్పొరేషన్‌ ను కష్టాలు వెంటాడుతున్నాయి. గొప్పకు పోయి అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూను తాహతుకు మించి ఖర్చులు చేయడంతో కార్పొరేషన్‌ సంక్షోభంలో పడింది. ఉత్సవాల కోసం చేసిన 90 కోట్ల రూపాయలను సర్కార్‌ నుంచి రాబట్టుకునేందుకు అపసోపాలు పడుతోంది.

ఫ్లీట్‌ రివ్యూ నేపథ్యంలో విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. కేవలం 23 కోట్లు మాత్రమే ఇచ్చింది. హుదుహుద్‌ తుపాను దెబ్బకు నష్టపోయినప్పుడు ఇస్తామన్న 1200 కోట్లు కూడా ఇప్పటివరకు కార్పొరేషన్‌కు అందలేదు. ఇదే తరుణంలో ఫ్లీట్‌ రివ్యూను ఘనంగా నిర్వహించేందుకు పలు సంస్థల నుంచి జీవీఎంసీ అప్పులు చేసింది. ఇప్పుడు సర్కార్‌ చేతులెత్తేయడంతో కార్పొరేషన్‌ ఆర్ధిక సంక్షోభంలో ఇరుక్కుంది. పలు సంస్థలకు కార్పొరేషన్‌ 300 కోట్ల రూపాయల మేర అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అప్పులకు వడ్డీ చెల్లించడం జీవీఎంసీకి తలకు మించిన భారంగా మారింది.   ఇప్పటికే హుదుహుద్‌ తుపాను నష్టపరిహారం రాక అల్లాడుతున్న జీవీఎంసీపై.. ఫ్లీట్‌ రివ్యూ నిధుల భారం పడింది. ఆ ఖర్చులను భరిస్తామని హామీ ఇచ్చిన సర్కార్‌ ఇప్పటివరకు ఎలాంటి సాయం చేయకపోవడంతో.. సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టమంటున్నారు.
Tags:    

Similar News