మోడీకి ఇంటర్ పోల్ సపోర్టు

Update: 2015-09-07 11:22 GMT
 మోడీని ఇరుకునపెట్టేందుకు ఎన్ ఫోర్సుమెంటు డైరెక్టరేట్(ఈడీ) చేసిన ప్రయత్నాలను ఇంటర్ పోల్ తప్పుపట్టింది.. ప్రధాని మోడీని ఈడీ ఇరుకునపెట్టడమా అనుకోవద్దు... ఈ మోడీ ప్రధాని మోడీ కాదు.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. అవును... మనీ లాండరింగ్ కేసులో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్‌ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్‌ పోల్ నుంచి ఈడీకి లేఖ కూడా అందింది.

ఆర్ధిక నేరారోపణలను ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని భారత్‌ కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈడీ కూడా లలిత్ మోడీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఇంటర్‌ పోల్‌ ను సంప్రదించారు. అయితే... ఏ లెక్కన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్‌ పోల్ ప్రశ్నించింది. ఈడీ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ ను ఇంటర్‌ పోల్‌ కు సమర్పించింది. దీంతో ఈడీ కంగుతినాల్సివచ్చింది.. అయితే... దేశపు అత్యున్నత విచారణ సంస్ధ రెడ్ కార్నర్ నోటీసు ఇస్తే, దాన్ని ప్రశ్నించే హక్కు ఇంటర్‌ పోల్‌ కు లేదని ఈడీ వర్గాలు అంటున్నాయి. సీబీఐ సూచనల మేరకే ఈడీ ఈ నోటీసులు ఇచ్చిందని, దీన్ని లియాన్‌ లోని ఇంటర్‌ పోల్ హెడ్‌ క్వార్టర్స్‌ కు పంపామని, వారి నుంచి ఇటువంటి స్పందన వస్తుందని తాము ఊహించలేదని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. లలిత్ మోడీకి నోటీసులపై ఈ నెలాఖరులోగా ఇంటర్‌ పోల్ నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.
Tags:    

Similar News