అంబ‌టి, అవంతిపై విచార‌ణ తప్ప‌దు

Update: 2021-08-22 13:26 GMT
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న కేబినెట్ లోని కీల‌క మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటుగా పార్టీలో కీల‌క నేత‌గానే కాకుండా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించార‌ట‌. ఈ ఇద్ద‌రు నేత‌ల‌పై త‌లెత్తిన వివాదాల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ట‌. అంతేకాకుండా వారిద్ద‌రిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు, వారికి సంబంధించిన‌విగా భావిస్తున్న ఆడియో టేపుల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని కూడా జ‌గ‌న్ తీర్మానించార‌ట‌. ఈ మేర‌కు అధికార యంత్రాంగానికి జ‌గ‌న్ ఇదివ‌ర‌కే ఆదేశాలు జారీ చేశార‌ట‌. అంతేకాకుండా ఆడియోలో మాట్లాడిన వారు అవంతి, అంబ‌టిలే అయితే వారిపైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని కూడా జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశార‌ట‌.

అవంతి అంటే.. మొన్నటి ఎన్నిక‌ల ముందే వైసీపీలో చేరిన నేత‌. అంబ‌టి అలా కాదు క‌దా. వైసీపీ ప్రారంభ‌మైన నాటి నుంచి ఆ పార్టీ గ‌ళంగా మారిన నేత ఆయ‌న‌. జ‌గ‌న్ పై ఎవ‌రు విమ‌ర్శ‌లు సంధించినా.. వెనువెంట‌నే వారిపై రివ‌ర్స్ అటాక్ చేస్తూ మీడియా ముందుకు వ‌చ్చే అంబ‌టి.. జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడ‌నే చెప్పాలి. అలాంటి అంబ‌టిపై జ‌గ‌న్ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారంటే న‌మ్మేదెలా? అంటే.. స్వ‌యంగా రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ.. మంత్రి, ఎమ్మెల్యేపై విచార‌ణ జ‌రిపి వాస్త‌మ‌వ‌ని తేలితే క‌ఠిన చర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతుంటే న‌మ్మ‌క త‌ప్ప‌దు క‌దా. రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా వాసిరెడ్డి ఈ విష‌యంపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

అయినా ఈ దిశ‌గా వాసిరెడ్డి ఏమ‌న్నారంటే..  ''ఇలాంటి వాటిని మా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌డం లేదా స‌హించ‌డం అనేది ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చేయ‌దు. ఈ ఆడియోల్లోని వాయిస్ త‌మ‌ది కాద‌ని అంబ‌టి రాంబాబు, అవంతి శ్రీ‌నివాస‌రావు చెబుతున్నారు. అదంతా అభూత‌క‌ల్ప‌న అని వాళ్లిద్ద‌రూ కొట్టి పారేస్తున్నారు. అయితే మ‌హిళా క‌మిష‌న్ త‌ర‌పున అస‌లు వాస్త‌వాలేంటో నిర్ధారించుకునేందుకు విచార‌ణ జ‌రుపుతున్నాం. వ‌రుస‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై స‌ర‌స సంభాష‌ణ‌ల‌కు సంబంధించి ఆడియోలు వైర‌ల్ కావ‌డంపై పూర్తిస్థాయిలో స‌మాచారం తెప్పించుకుంటాం. ఒక‌వేళ ఆ ఆడియోల్లోని వాయిస్ నిజ‌మ‌ని తేలితే క‌ఠినంగా శిక్షిస్తాం. మ‌హిళ‌ల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌ను మా ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించ‌దు'' అని వాసిరెడ్డి ఫుల్ క్లారిటీగానే జగన్ మనసులోని మాటను చెప్పేశారు.
Tags:    

Similar News