షాకింగ్‌.. ఐఫోన్ దానంత‌ట అది చేసిన ప‌నితో బిత్త‌ర‌పోయిన మ‌హిళ‌!

Update: 2022-10-13 16:30 GMT
ఐఫోన్.. దాని ఖ‌రీదు ఎంత ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ దాన్ని కొనుగోలు చేసేవారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోందే కానీ త‌గ్గడం లేదు. కొత్త మోడ‌ల్ విడుద‌ల కావ‌డం ఆల‌స్యం వెంట‌నే అమెరికాలో ఉన్న త‌మ బంధువులు, స్నేహితుల ద్వారా దాన్ని చేజిక్కుకుంటున్నారు. మ‌రికొంత‌మంది ఐఫోన్ ముందుగా విడుద‌ల‌వుతుంటే దుబాయ్ వంటి చోట్ల‌కు వెళ్లిపోయి కిలోమీట‌ర్ల కొద్దీ క్యూలో ఉండి వాటిని ద‌క్కించుకుంటున్నారు. అంత‌టి డిమాండ్ ఐఫోన్ 14 సిరీస్ ఇటీవ‌లే మార్కెట్‌లోకి విడుద‌ల‌యిన సంగ‌తి తెలిసిందే.

ఐఫోన్ 14 సిరీస్‌లో ఉన్న ఫీచ‌ర్స్‌తో ఐఫోన్ అభిమానులు ఎగ‌బ‌డి కొంటున్నారు. ఈ క్ర‌మంలో అమెరికాలోని ఓ మ‌హిళ కూడా ఐఫోన్ 14 ప్రో కొనుగోలు చేసింది. అయితే ఆమెకు ఐఫోన్ ఓ విష‌యంలో షాకివ్వ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడీ ఈ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిపై నెటిజ‌న్లు అనేక విధాలుగా త‌మ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తుండ‌టం వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కూ ఆ మ‌హిళ‌కు ఐఫోన్ ఇచ్చిన షాక్ ఏమిటంటే.. సారా వైట్ అనే 39 ఏళ్ల అమెరిక‌న్ మ‌హిళ త‌న కుటుంబంతో స‌ర‌దాగా గ‌డిపేందుకు ఒహియో రాష్ట్రంలోని కింగ్స్ ఐలాండ్ కు వెళ్లింది. త‌ర్వాత కుటుంబ సభ్యులతో కలిసి థీమ్ పార్కులో ఉన్న రోలర్ కోస్టర్ రైడింగ్‌కు వెళ్లింది. 109 అడుగుల ఎత్తులో 50 కిలోమీటర్ల వేగంతో రోలర్ కోస్టర్ దూసుకుపోతోంది.  ఆమె ఈ రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సారా వైట్ తాజాగా కొనుగోలు చేసిన ఐఫోన్ 14 ప్రో ఆమెకు తెలియ‌కుండా తన పని తాను చేసేసింది.

ఆమె కిలోమీట‌ర్ల వేగంతో రైడ్ చేస్తుండ‌టంతో ప్ర‌మాదంలో ఉండి ఉంటుంద‌ని భావించిన ఐఫోన్ 14 ప్రో త‌న య‌జ‌మాని ప్రమాదంలో ఉన్నట్టు భావించి ఎమర్జెన్సీ నంబ‌ర్‌ను సంప్రదించింది. 'ఈ ఫోన్ ఓనర్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. తన నుంచి ఎటువంటి స్పంద‌న‌ లేదు' అంటూ రోలర్ కోస్టర్ చేసే శబ్దాన్ని... అక్కడ పర్యాటకుల అరుపుల‌ను రికార్డ్ చేసి ఆడియో మేసేజ్‌ను పంపేసింది. దీంతో ఆ మేసేజ్ త‌మ‌కు చేరిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్నారు. అయితే అక్కడ అంతా మామాలుగానే ఉండటంతో పోలీసులు షాక్ తిన్నారు. దీంతో త‌మ‌కు ఏ ఫోన్ నంబ‌ర్ నుంచి అయితే ఫోన్ వ‌చ్చిందో ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేశారు.

ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల నుంచి ఫోన్ రావడంతో ఒక్కసారిగా కంగుతిన్న సారా వైట్.. తన  ఐఫోన్ 14 ప్రో చేసిన పొరపాటును గుర్తించి అధికారులకు వివరించింది. దీంతో అధికారులు అక్కడ నుంచి వెనుతిరిగారు.

కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్ట‌డం విశేషం. అదే 'క్రాష్ డిటెక్షన్ ఫీచర్'. మనం వాహనాల్లో ప్రయాణించేటప్పుడు.. ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే ఎమర్జెన్సీ నంబ‌ర్‌కు ఈ ఫీచ‌ర్ ద్వారా ఆటోమేటిక్‌గా కాల్ వెళ్తుంది. ఈ నేప‌థ్యంలోనే సారా వైట్ ప్ర‌మాదంలో చిక్కుకుంద‌ని భావించిన ఆమె ఐఫోన్ 14 ప్రో ఆటోమేటిక్‌గా సందేశాన్ని పోలీసులకు పంపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News