ఐఫోన్ 7 ఆశలన్నీ భారత్ పైనే!

Update: 2016-09-08 09:17 GMT
స్మార్ట్ ఫోన్ ప్రేమికుల‌ను ఎంత‌గానో ఊరిస్తూ వ‌చ్చిన ఆపిల్ ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్ల‌స్ మోడ‌ల్స్ ను ఆ సంస్థ విడుద‌ల చేసింది. అత్యంత అట్ట‌హాసంగా శాన్ ఫ్రాన్సిస్కోలో జ‌రిగిన ప్రారంభోత్స‌వంలో ఈ రెండు ఫోన్ల ఫీచ‌ర్ల గురించి యాపిల్ సంస్థ ప్ర‌క‌టించింది. గ‌త ఫోన్ల‌తో పోల్చితే చాలా కొత్త ఫీచ‌ర్లు ఈ ఫోన్ల‌లో ఉండ‌టం విశేషం. దీంతో ఈ ఫోన్ల‌ను సొంతం చేసుకోవాలిన యాపిల్ అభిమానులు ఆరాటప‌డుతున్నారు. అమెరికాలో ఈ ఫోన్ల‌ను ఈ నెల 16వ తేదీ నుంచి విక్ర‌యించ‌బోతున్నారు. రేపటి నుంచే ప్రీ బుకింగ్స్ తీసుకుంటారు. అయితే, మ‌న‌దేశానికి ఈ ఫోన్లు త్వ‌ర‌లోనే వ‌చ్చేస్తున్నాయి! లాంఛింగ్ ఈవెంట్ లోనే ఈ తేదీల‌ను ఆపిల్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించ‌డం విశేషం. ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్ల‌స్ ఫోన్ల అమ్మకాలు మ‌న‌దేశంలో అక్టోబ‌ర్ 7 నుంచి ప్రారంభించ‌బోతున్న‌ట్టు అధికారికంగా ఆ సంస్థ వెల్ల‌డించింది. మిగ‌తా మొబైల్ ఫోన్ల ఫ్లాగ్ షిప్ మోడ‌ల్స్ కంటే త‌క్కువ ధ‌ర‌కే ఫోన్లు ల‌భిస్తాయ‌ని ప్ర‌క‌టించింది.

ఈ కొత్త మోడ‌ల్స్ లోని 32 జీబీ వెర్ష‌న్ రూ. 60,000 ప్రారంభ ధ‌రగా ఉండొచ్చ‌ని చెబుతున్నారు. 32 జీబీ - 128 జీబీ, 256 జీబీ కెపాసిటీల‌తో వేర్వేరు వెర్ష‌న్ల ఫోన్లు వినియోగదారుల‌కు అందుబాటులో రానున్నాయి. ఈసారి భార‌త్ మార్కెట్ పై కూడా ఆపిల్ సంస్థ చాలా ఆశ‌లు పెట్టుకున్న‌ట్టుగా ఉంది. అందుకే, అధికారికంగా విక్ర‌య తేదీల‌ను కూడా ప్ర‌క‌టించింది. నిజానికి ఆపిల్ కు స‌మీప వ్యాపార ప్ర‌త్య‌ర్థి సంస్థ శాంసంగ్ ఈ మ‌ధ్య‌నే గేల‌క్సీ నోట్ 7 విడుద‌ల చేసింది. ఆ మోడ‌ల్ అందరినీ బాగానే ఊరించింది. అయితే, విక్ర‌యించిన ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో వాటిని వెన‌క్కి తీసుకుంటోంది. విక్ర‌యించిన మోడ‌ల్స్ కు క్యాష్ బ్యాక్ కూడా ఇచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతానికి శాంసంగ్ గేల‌క్సీ నోట్ 7 అమ్మకాల‌ను నిలిపేశారు. కాబ‌ట్టి, ఈ మార్కెట్ స్పూస్ ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ఆపిల్ భావిస్తోంది.

ఇంకోప‌క్క‌... రెండో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగిన చైనాలో ఆపిల్ ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కాబ‌ట్టి, ఈసారి భార‌త్ మార్కెట్ పై ప్ర‌త్యేక దృష్టి సారించింది ఆపిల్‌. మన‌దేశంలో ఐఫోన్ మోజు కూడా ఇటీవ‌లి కాలంలో బాగా పెరుగుతోంది. మొత్తానికి ఐఫోన్ 7 - ఐఫోన్ 7 ప్ల‌స్ మోడ‌ల్స్ కు భార‌త్ మార్కెట్ బాగానే క‌లిసి వ‌చ్చేట్టుగా అనిపిస్తోంది.
Tags:    

Similar News