ఐపీఎల్.. ఈసారి లీగ్ లో వీరిపై ఓ కన్నేయాల్సిందే

Update: 2022-04-05 15:30 GMT
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ అభిమానులకు వినోదం పంచుతోంది. భారత కుర్రాళ్ల మెరుపులతో లీగ్ ఈసారి మరింత ఆకర్షణీయంగా మారింది. 10 జట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి తలపడుతున్న లీగ్ లో కొందరు అన్ క్యాప్ డ్ కుర్రాళ్లు అదరగొడుతున్నారు. అసలు ఐపీఎల్ అంటేనే ప్రతిభావంతుల వేదిక. దీని ద్వారా టీమిండియాతో పాటు ఆయా దేశాల జట్లకు ఎంపికైన వారెందరో. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శన టీమిండియా ఎంపికకు గీటురాయి కాదని కొన్నాళ్ల కిందట వరకు అనేవారు. కానీ, ఇప్పుడా నిబంధన ఏమీ లేదు. లీగ్ నుంచి నేరుగా జాతీయ జట్టులోకి వచ్చేస్తున్నారు. గత సీజన్ నే తీసుకుంటే వెంకటేశ్ అయ్యర్ ఓ ఉదాహరణ. కోల్ కతా నైట్ రైడర్స్ కు.. అదికూడా లీగ్ రెండో దశలో ఆడిన వెంకటేశ్.. ఇప్పుడు టీమిండియా ఆల్ రౌండర్. అయితే, ప్రస్తుత ఏడాది లీగ్ లో కూడా కొందరు కుర్రాళ్లు అదరగొడుతున్నారు. నిరుడు వెంకటేశ్ లాగే నేడు వీరూ అన్ క్యాప్ డ్ ఆటగాళ్లే. సుడి కలిసొస్తే లీగ్ ఫామ్ తో టీమిండియాకు ఎంపికయినా ఆశ్చర్యం లేదు.

భలే భలే బదోని..
ఆ కుర్రాడికి 22 ఏళ్లు. అంతకుముందు అతడి పేరు కూడా ఎవరికీ తెలియదు. వేలంలో పలికిన ధర కూడా రూ.22 లక్షలే. కానీ, అంతకు పదిరెట్లు విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతున్నాడు. కొత్త ఫ్రాంఛైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కు ఆడుతున్నఆయుష్‌ బదోని గురించి ఇదంతా. గుజరాత్‌తో తొలి మ్యాచ్‌లో 54 (41 బంతుల్లో 4x4, 3x6) పరుగులు చేశాడు. బౌలర్ ఎవరైనా భయం లేకుండా ఆడడం బదోని తీరు.

29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును దీపక్‌ హుడా (55; 41 బంతుల్లో 6x4, 2x6)తో కలిసి ఆదుకున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో211 పరుగుల భారీ ఛేదనలో.. బదోని (19; 9 బంతుల్లో 2x6) చివర్లో మెరుపు బ్యాటింగ్‌ చేసి విలువైన పరుగులు అందించాడు. తాజాగా హైదరాబాద్‌తో ఆడిన మ్యాచ్‌లోనూ (19; 12 బంతుల్లో 3x4) ధాటిగా ఆడాడు. 3 మ్యాచ్‌ల్లో 148.38 స్ట్రైక్‌రేట్‌తో 92 పరుగులు చేశాడు. కాగా, చెన్నైతో మ్యాచ్ లో బదోని మిడిల్ వికెట్ మీదకు వచ్చి ఫైన్- స్వ్కేర్ లెగ్ మీదుగా కొట్టిన సిక్స్.. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను తలపించింది.

హైదరాబాదీ తిలక్.. తగ్గేదే.. లె
టాలెంటెడ్ యువకులను ప్రోత్సహించడంలో ముంబయి టీమ్‌ ముందువరుసలో ఉంటుంది. అదే జట్టు తరఫున అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు హైదరాబాదీ తిలక్‌ వర్మ. 19 ఏళ్ల తిలక్ ను మెగా వేలంలో రూ.1.7 కోట్ల ధర దక్కించుకున్న ఇతడు ముంబయికి న్యాయం చేస్తున్నాడు. దిల్లీతో తలపడిన తొలి మ్యాచ్‌లో (22; 15 బంతుల్లో 3x4) పరుగులు చేసి.. తర్వాత రాజస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో (61; 33 బంతుల్లో 3x4, 5x6) మెరుపులు మెరిపించాడు. ముంబయి ఓడినా తిలక్‌ వర్మకు బ్యాట్స్‌మన్‌గా మంచి గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ఆడిన 2 మ్యాచ్‌ల్లో 172.91 స్ట్రైక్‌రేట్‌తో 83 పరుగులు చేశాడు.

లలిత్ యాదవ్
ఢిల్లీకి చెందిన లలిత్ యాదవ్ గతేడాది ఈ టీ20 లీగ్‌లో అరంగేట్రం చేసినా ఆకట్టుకోలేకపోయాడు. కానీ, అతడిపై నమ్మకం ఉంచిన దిల్లీ ఈ సీజన్‌ మెగా వేలంలో రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని అందింపుచుకున్న అతడు ముంబయితో ఆడిన తొలి మ్యాచ్‌లో (48 నాటౌట్‌; 38 బంతుల్లో 4x4, 2x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో (25; 22 బంతుల్లో 2x4, 1x6) బాగా ఆడినా ఊహించని పరిస్థితుల్లో రనౌటయ్యాడు. ఇలా ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే 121.66 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 73 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ ముగ్గురూ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్లుగా నిలిచారు.

వైభవ్ అరోరా
24 ఏళ్ల అరోరా పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌలింగ్‌లో విశేషంగా రాణిస్తున్న అరోరా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టాడు. వేసిన తొలి ఓవర్‌లో సీఎస్‌కే ఓపెనర్ రాబిన్ ఉతప్పను అవుట్ చేసిన అరోరా.. ఆ తర్వాతి ఓవర్‌లో మొయిన్ అలీని బౌల్డ్ చేశాడు. అరోరా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన దేశవాళీ ఆటగాడు. 2021లో ఐపీఎల్ వేలంలో కేకేఆర్ జట్టు అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈసారి పంజాబ్ కింగ్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రికెట్ వదిలేసిన అరోరా ఆ తర్వాత యూటర్న్ తీసుకుని రంజీలో ఆడాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు ఇచ్చి 9 వికెట్లు తీసి సత్తా చాటాడు.
Tags:    

Similar News