ఏపీ సీఎస్‌తో ఐపీఎస్ ఏబీవీ భేటీ.. పోస్టింగ్ కోసం అభ్య‌ర్థ‌న‌

Update: 2022-04-30 13:52 GMT
ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లారు. యూనిఫాంలో  సెక్రటేరియట్‌కు వచ్చారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(సీఎస్) సమీర్‌శర్మను కలిసినట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని  ప్రభు త్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేప‌థ్యంలో ఆ ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఏబీవీ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సీఎస్‌కు రిపోర్ట్ చేశానని, పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. అవసరమైన ఆదేశాలివ్వాలని సీఎస్‌ను కోరానని, లెటర్ ఇచ్చానని.. పోస్టింగ్ విషయం ప్రాసెస్‌లో పెడతారని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.

సుప్రీం ఏం చెప్పిందంటే..

ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టులో ఇటీవ‌ల‌ ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. వెంటనే ఆయన్ను సర్వీసుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్‌ విధించిన రెండేళ్ల తర్వాత కొనసాగింపు కుదరరదని తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం   సమర్పించిన నివేదికలో స్పష్టమైన వివరాలు లేకపోవడం తో.. ప్రభుత్వం మరికొంత సమయం కావాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు తిరస్కరించింది.  

1989 ఏపీ ఐపీఎస్ కేడర్‌కు చెందిన వెంకటేశ్వరరావు.. గత ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారంటూ ఏబీపై ఆరోపణలు వచ్చాయి ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేయడంతో.. ఏబీని ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి తప్పించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. వెంకటేశ్వరరావు బదిలీ కాగా.. ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.. వెయిటింగ్‌లో కొనసాగారు.

ఆ తర్వాత విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏబీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన సమయంలో నిబంధనల్ని ఉల్లంఘించారని పేర్కొంది.. ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేసినట్లు ఆరోపించారు. తనను సస్పెండ్ చేయడంపై ఆయన క్యాట్‌ను, కోర్టును ఆశ్రయించారు.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎంక్వైరీ కమిషన్‌ విచారణ జరిపింది. ఆయన కూడా హాజరుకాగా.. విచారణ కమిషనర్‌ ముందు ఏబీ తన వాదనను వినిపించారు.

అనంతరం వెంకటేశ్వరరావును కొన్ని వివాదాల్లో ఉన్నారు. కొద్దిరోజుల తర్వాత ఈ సస్పెన్షన్ వ్యవహారం హైకోర్టుకు చేరగా.. సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2020 మే 22న ఇచ్చిన తీర్పు ఇచ్చింది. దీనని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో ఏబీ సస్పెన్షన్‌ వ్యవహారంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌‌పై  విచారణ జరిగింది. ఈ క్రమంలో వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎంతకాలం కొనసాగిస్తారని ఏపీ సర్కారును ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ చేయకూడదన్న నిబంధనలను గుర్తు చేసింది.

అలాగే ఆయన సస్పెన్షన్‌కు సంబంధించి రెండేళ్ల తర్వాత కొనసాగించాలన్న వాదనలకు ఆధారాలు చూపాలని ఆదేశించింది కోర్టు. ఇటీవ‌ల జరిగిన విచారణలో తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉంటే వెంకటేశ్వరరావు ఇటీవల ఆయన ప్రెస్ మీట్ పెట్టడంపై వివాదాస్పదమైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియా ముందుకు రావడంతో షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. దీనిపై ఏబీ వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో ఊరట లభించిన నేప‌థ్యంలో ఏబీవీ ప్ర‌భుత్వాన్ని క‌లిశారు. మ‌రి ఆయ‌న‌కు పోస్టింగ్ ఇస్తారో.. లేక‌.. ప్రెస్‌మీట్ వంక‌తో ఆపుతారో చూడాలి.
Tags:    

Similar News