పెద్దన్న తో వారికి గొడవ.. మనకు మూడేలా ఉందే

Update: 2020-01-06 11:59 GMT
ఇద్దరు కొట్టుకుంటుంటే.. సంబంధం లేని మూడో వ్యక్తి మాడు పగలటం లాంటి అనుభవమే ఇప్పుడు భారత్ మీద పడుతోంది. ప్రపంచానికి పెద్దన్న అమెరికా తో ఇరాన్.. ఇరాక్ లతో మొదలైన రచ్చ ఇప్పుడు దేశం మీద ప్రభావం చూపిస్తోంది. అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న అమెరికా.. ఆ దేశంలో ఇరాన్ కు.. ఇరాక్ కు మొదలైన రచ్చ తాలుకూ ఎఫెక్ట్ గంటల వ్యవధిలో మన మీద పడటం మొదలు కావటంతో.. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత విషమిస్తే.. మన పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

నిజానికి మనమే కాదు.. ప్రపంచం లోని పలు దేశాలు ఇలాంటి ప్రభావాన్నే ఎదుర్కొంటున్నాయి. అమెరికా.. ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్ల ను కలవర పెట్టటమే కాదు.. ముడి చమురు.. బంగారం ధరల్ని పెంచేశాయి. ప్రత్యక్షంగా సంబంధం లేకున్నా.. యుద్ధ భయం మన దేశీయ మార్కెట్ల మీద ప్రభావాన్ని చూపుతోంది. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సెన్సెక్స్ ఇప్పటివరకూ 700 పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ ఏకంగా 210 పాయింట్లు పతనమైంది.

డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా క్షీణించి ఇప్పుడు రూ.72.10గా నమోదైంది. ఇక.. బంగార ధరలు కూడా భగ్గుమంటున్నాయి. మధ్యప్రాచ్యంలో తాజాగా నెలకొన్న పరిణామాల తో బంగారం మీద పెట్టుబడులు పెరగటంతో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే పది గ్రాముల బంగారం ఒకట్రెండు రోజుల్లోనే అర లక్షకు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. పుత్తడి ధరకు కూడా రెక్కలు వచ్చాయి. మార్కెట్లో బంగారం విలువ ఏడేళ్ల గరిష్ఠానికి నమోదైంది.

తాజాగా.. పది గ్రాముల బంగారం రూ.41,770 వరకు వెళ్లగా.. వెండి కేజీ రూ.49,600 చేరుకుంది. యుద్ధ భయం పెరిగే కొద్దీ ఈ ధర మరింత పెరిగే వీలుంది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. తాజా పరిణామాలతో బ్యారెల్ ముడి చమురు 63.8 డాలర్ల కు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి బ్యారెల్ ముడి చమురు కేవలం 50 డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. ఈ ధరా ఘాతాలతో దేశ ప్రజల రోజువారీ జీవితం మీద కూడా ప్రభావం పడటం ఖాయం.


Tags:    

Similar News