ఐఆర్‌ సీటీసీ వెబ్‌ సైట్‌ కి ఏమైంది?

Update: 2018-05-04 07:58 GMT
దేశ వ్యాప్తంగా ట్రైన్ జ‌ర్నీకి అవ‌స‌ర‌మైన టికెట్ల‌ను ఆన్ లైన్లో కొనుగోలు చేయ‌టానికి నిత్యం వేలాదిమంది ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ సాయంతో రిజ‌ర్వేష‌న్లు చేయిస్తుంటారు. అలాంటి కీల‌క‌మైన సైట్ ఈ రోజు ఉద‌యం నుంచి కొన్ని గంట‌ల పాటు ప‌ని చేయ‌క‌పోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ రోజు ఉద‌యం సైట్ బాగానే ప‌ని చేసినా.. ఉద‌యం 11 గంట‌ల నుంచి ఉన్న‌ట్లుండి మొరాయించ‌టం మొద‌లైంది.

కొన్ని గంట‌ల పాటు సైట్ ప‌ని చేయ‌క‌పోవ‌టంతో వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందికి గుర‌య్యారు. కొంద‌రు నెట్ వ‌ర్క్ లో ఏదైనా లోపం త‌లెత్తింద‌న్న ఆలోచ‌న‌కు గురి కాగా..మ‌రికొంద‌రు క‌స్ట‌మ‌ర్ కేర్ కు ఫోన్ చేశారు. అయితే.. స‌ర్వీసు అందుబాటులో లేద‌ని.. కాస్త స‌మ‌యంలోనే సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పినా.. ఫ‌లితం మాత్రం పాజిటివ్ గా లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపించింద‌

టికెట్‌రిజ‌ర్వేష‌న్ సేవ‌లు వెబ్ సైట్ లోనే కాదు.. మొబైల్ యాప్ లోనూ ప‌ని చేయ‌లేద‌ని చెబుతున్నారు. ఐఆర్ సీటీసీ సేవ‌లు ఆగిపోవ‌టంతో.. ఈ విష‌యాన్ని ఫిర్యాదు చేస్తూ ప‌లువురు కేంద్ర రైల్వే మంత్రి ట్విట్ట‌ర్‌ ఖాతాకు.. మెసేజ్ ల మీద మెసేజ్ లు పెడుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఈ ఉదంతంపై స్పందించేందుకు రైల్వే శాఖ ఇప్ప‌టివ‌ర‌కూ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క‌పోవ‌టం విశేసం.

కేవ‌లం రెండు రోజుల క్రితం సైట్ లో కొన్ని ముఖ్య‌మైన‌వి మార్చ‌టం.. అద‌న‌పు ఫీచ‌ర్ల‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా మే2 రాత్రి10.45 గంట‌ల నుంచి మే 3 ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ సైట్ ను మూసి వేశారు. ఇంట‌ర్న‌ల్ గా చేసిన మార్పులు విన‌యోగ‌దారుల‌కు శాపంగా మారింది.

అంతేకాదు.. ఐఆర్సీటీసీ లాంటి ప్ర‌ముఖ సైట్ అన్నేసి గంట‌లు ఆగిపోవ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మువుతున్నాయి. సైట్ డౌన్ కావ‌టానికి కార‌ణం సాంకేతిక లోప‌మా?  లేక‌.. హ్యాక‌ర్లు ఏమైనా హ్యాక్ చేశారా? అన్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఈ ఉదంతంపై ఒక ఖండ‌న కానీ ఒక వివ‌రం కానీ కేంద్ర రైల్వే శాఖ నుంచి వెలువ‌డ‌క‌పోవ‌టం ఏమిట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఒక ప్ర‌ముఖ సైట్ అన్నేసి గంట‌లు త‌న సేవ‌ల్ని ఎందుకు ఆపేయాల్సి వ‌చ్చింది?  అన్న సామాన్యుల సందేహాల‌కు స‌మాధానం చెప్పే వారెవ‌రు? 
Tags:    

Similar News