తెలుసా...బీమా ప్రీమియం త‌గ్గిపోయింది

Update: 2017-04-18 06:10 GMT
బీమా నియంత్రణ మండలి వాహ‌న దారుల‌కు శుభ‌వార్త తెలిపింది. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గిస్తున్నట్లు ఐఆర్‌ డీఏఐ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని మూడు వారాల క్రితం పెంచిన ఐఆర్‌ డీఏఐ...అంతలోనే తగ్గిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. దీంతో ద్విచక్ర - కార్లు - ట్రక్కులపై చెల్లించే థర్డ్ పార్టీ ప్రీమియం మరింత తగ్గనుంది. తగ్గించిన బీమా ప్రీమియం ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చిన్నట్లు ఐఆర్‌డీఏ పేర్కొంది. మార్చి 28న ప్రీమియాన్ని పెంచుతున్నట్లు బీమా నియంత్రణ మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రీమియం చెల్లింపులు గరిష్ఠంగానే ఉన్నాయి.

ఐఆర్‌ డీఏఐ తీసుకున్న తాజా నిర్ణయంతో మధ్యస్థాయి సెగ్మెంట్ కార్లపై (1,000సీసీ-1,500 సీసీ) చెల్లించే థర్డ్ పార్టీ ప్రీమియం రూ.3,133 నుంచి రూ.2,863కి తగ్గనుంది. వీటితోపాటు 1,500 సీసీ కంటే అధిక సామర్థ్యం కలిగిన లగ్జరీ కార్లపై చెల్లించే ప్రీమియం కూడా రూ.8,630 నుంచి రూ.7,890కి తగ్గింది. కానీ 1,000 సీసీ సామర్థ్యం లోపు కలిగిన కార్లపై విధించే ప్రీమియం(రూ.2,055) ఎలాంటి మార్పులు చేయలేదు. 150 సీసీ, ఆపై ఇంజిన్ సామర్థ్యం కలిగిన ద్విచక్ర వాహనాలు చెల్లించే థర్డ్ పార్టీ ప్రీమియాన్ని కూడా తగ్గించింది. ఎంతమేర తగ్గించిందో మాత్రం ఐఆర్‌ డీఏఐ వెల్లడించలేదు. అలాగే ట్రక్కులపై(40వేల కిలోలకంటే అధికం) విధించే థర్డ్ పార్టీ ప్రీమియాన్ని రూ.36,120 నుంచి రూ.33,024కి తగ్గించింది. వీటితోపాటు ఈ-రిక్ష - ఇతర ప్యాసింజర్ వాహనాలపై కూడా ప్రీమియాన్ని సవరించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News