బీజేపీలోకి 20 మంది కాంగ్రెస్ నేతలు.. జంప్ ఖాయం

Update: 2022-12-20 09:30 GMT
బీజేపీ ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను చావుదెబ్బతీసిన కమలదళం.. ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ నే బలిపశువుగా చేయాలని చూస్తోంది. బీజేపీ ముఖ్యనేతలతో పలువురు కాంగ్రెస్ నాయకులు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. వీరిలో మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల నేతలు దాదాపు 15 నుంచి 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో హైదరాబాద్ , చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు సాగించినట్టు తెలుస్తోంది. పలువురు కాంగ్రెస్ నాయకులకు దగ్గరగా ఉన్నవారు, వారి అనుచరులు ఈటలతోపాటు ఆయన నివాసంలో భేటి అయ్యి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడించినట్టు సమాచారం.

బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో మంత్రులుగా , ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగిన మాజీ మంత్రులు డీకే అరుణ, మర్రిశశిధర్ రెడ్డి కూడా చేరికలపై హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్టు సమాచారం.

బీజేపీ నేతలు డీకే అరుణ, రాజగోపాల్ రెడ్డిలతో కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడి ఎలాగూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్వరలో చేరుతారు కాబట్టి అతడితోటి కాంగ్రెస్ సీనియర్స్ కూడా చేర్పించాలని చూస్తున్నారు. ఆలోపు కాంగ్రెస్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయాలని చూస్తున్నారంట..

ఓవైపు కేసీఆర్ ఎత్తులు.. మరోవైపు బీజేపీ చిత్తులు.. ఈ రెండింటి రాజకీయ సంగ్రామానికి మధ్యలో కాంగ్రెస్ నలిగిపోతోంది. వాళ్లిద్దరూ బలం పెంచుకోవడానికి కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తున్నారు. బలహీన పరుస్తున్నారు. కాంగ్రెస్ నుంచే నేతలను లాగుతున్నారు. కొందరినీ కోవర్టులుగా మార్చి రాజకీయంగా వాడుకుంటున్నారు.

బీజేపీలో చేరేవారికి ప్రధాన డిమాండ్ గా టికెట్ అడుగుతున్నారు. టికెట్ల కేటాయింపుపై బండి సంజయ్, ఈటల ఇతర నేతలు ఎవరూ కూడా హామీనివ్వడం లేదు. పార్టీలో చేరాక సంబంధిత నియోజకవర్గంలో పలుకుబడి చూసి సర్వే చేసి రాజకీయ ప్రాబల్యం, ప్రజల్లో మద్దతు ఉంటేనే టికెట్లు ఇస్తామని బీజేపీ అధిష్టానం స్పష్టం చేస్తోంది. బీజేపీలో ఆర్ఎస్ఎస్ సర్వే తర్వాతే టికెట్లు ఇస్తారు.  అందుకే బీజేపీలో చేరికకు కాంగ్రెస్ నేతలు ఈ డిమాండ్ చేస్తున్నారు. దీంతో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సోమవారం రాత్రి పార్టీ జాతీయ కార్యదర్శి, పార్టీ ఇన్ చార్జి అర్వింద్ మీనన్ కు ఈ విషయం తెలియజేసినట్టు సమాచారం. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం బీజేపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వస్తే 20 మంది కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడం లాంఛనమే అవుతుంది.

టీఆర్ఎస్ లో ఇటీవల వివాదస్పదంగా మారిన మంత్రితోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలను సంప్రదించినట్టు సమాచారం. కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే విషయంపై ప్రాథమికచర్చలు జరుపుతున్నారు. బీజేపీ అధిష్టానం నుంచి టికెట్ హామీ వస్తే ఈ 20 మంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడం దాదాపు లాంఛనమే అని చెప్పొచ్చు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News