అంతమంది ఒత్తిడి తెస్తున్నా బైడెన్ మాత్రం మోడీతో మాట్లాడటం లేదా?

Update: 2021-04-25 02:30 GMT
అంకెల్ని చూస్తేనే గుండె జారిపోయేలా ఉన్న దుస్థితి. కేవలం 24 గంటల వ్యవధిలో 3.46 లక్షల కేసులు భారత్ లో నమోదైన దుస్థితి. అంటే.. దేశంలో సెకనుకు నలుగురు కరోనా బారిన పడుతున్న పరిస్థితి. కనురెప్ప తెరిచి.. మూసేసే లోపు నలుగురు.. ఆ మాటకు వస్తే.. ఈ లైన్ చదివే నాటికి దేశంలో మరో ఎనిమిది మంది వరకు కరోనా బారిన పడుతున్న తీరు గురించిన ఆలోచనే వణుకు పుట్టేలా చేస్తోంది. ఇలాంటివేళ.. వాయు వేగంతో నిర్ణయాలు తీసుకొని కరోనాకు చెక్ పెట్టేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు.. భారత్ లో నెలకొన్న తాజా పరిస్థితితో అమెరికా సర్కారు మీద ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. భారీగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో భారత్ కు వీలైనంత త్వరగా సాయం చేయాలన్న వినతులు వైట్ హౌస్ కు హోరెత్తుతున్నాయి. అవసరమైన వైద్య సామాగ్రితో పాటు.. అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సహా అన్ని రకాల సాయం అందించాలని కోరుతున్నారు. ఇలా కోరుతున్నది వాళ్లు వీళ్లు కాదు.. యూఎస్ లో పవర్ ఫుల్ లాబీలు ఇప్పుడు రంగంలోకి దిగాయి.
అమెరికాలో భారీ ఎత్తున టీకాలు నిల్వ ఉండటం.. వాటిని ఇప్పటికిప్పుడు వినియోగించే అవసరం లేకపోవటం.. జూన్ వరకు ఆగాల్సిన నేపథ్యంలో.. అప్పటికి మళ్లీ ఉత్పత్తి అవుతాయి కాబట్టి.. ముందు ఆ వ్యాక్సిన్లను భారత్ కు పంపాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరుతోంది యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. క్లిష్ట సమయంలో యావత్ ప్రపంచానికి భారత్ అండగా ఉన్న నేపథ్యంలో.. దానికి అదే తరహాలో సహకారం అందించాలని కోరుకుంటున్నారు.

భారత్ కు అవసరమైన వస్తువుల్ని పంపటానికి.. సరఫరాలో ఉన్న ఇబ్బందుల్ని అధిగమించటానికి అమెరికా ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి జాలినా పోర్టర్ చెబుతున్నారు. భారత్ లో కరోనా తీవ్రతరం ప్రపంచ సమస్యగా మారుతుందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. భారత్ కు సాయం అందించాలని ప్రముఖ మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్టు కోరింది. ఇక.. డెమొక్రాటిక్ పార్టీకి కీలక ఫండ్ రైజర్ గా పని చేసిన శేఖర్ మాట్లాడుతూ.. భారత్ లోని కరోనా ప్రభావం అమెరికాలోని ప్రతి భారతీయ కుటుంబం మీదా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోడీతో మాట్లాడాలన్న డిమాండ్ ఎక్కువ అవుతోంది. కష్టంలో ఉన్న భారత్ కు తాము ఆపన్న హస్తం అందిస్తామన్న మాటపై ఇంతమంది చెబుతున్నా బైడెన్ మాత్రం రియాక్టు కాకపోవటం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు బాహాటంగా దన్నుగా నిలిచిన మోడీ తీరుపై బైడెన్ గుర్రుగా ఉంటారంటారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన స్పందనను గుర్తు చేస్తున్నారు. మరి.. ఇప్పటికైనా ఆయన ఏ తీరులో స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News