బొత్స ప్రిపేర్ అయినట్లేనా... ?

Update: 2021-10-12 11:30 GMT
వైసీపీలో ఉన్న సీనియర్ మంత్రులలో బొత్స సత్యనారాయణ ఒకరు. ఉత్తరాంధ్రా మాండలీకంలో మాట్లాడే ఈ మంత్రి గారికి అక్కడ మంచి పట్టుంది. ఆయన సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. అందుకే ఆయన గత రెండు దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ పరిస్థితులను ఎప్పటికపుడు అంచనా వేస్తూ వాటికి అనుగుణంగా అడుగులు వేయడం బొత్స  మార్క్ పాలిటిక్స్. అందుకే ఒకనాడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నపుడు జగన్ని తీవ్రంగా విమర్శించి కూడా ఇపుడు ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన మంత్రిగా మారిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే తొందరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అన్న ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది.

దానికి తగినట్లుగానే చాలా మంది మంత్రులు బయట మాట్లాడుతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే నూటికి నూరు శాతం మంత్రులను పాతవారిని తప్పించి జగన్ కొత్తగా క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పేశారు. తనకు మంత్రి పదవి లేకపోయినా బాధేమీ లేదని కూడా ఆయన తేల్చేశారు. అదే విషయమై బొత్స కూడా తన సన్నిహితుల వద్ద మాట్లాడుతూ మంత్రిగా ఉంచినా లేక తీసేసినా ఫరవాలేదు అన్నట్లుగా స్పందించారు అంటున్నారు.

ఇక సీనియర్లను జగన్ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించుకుంటారు అని కూడా తెలుస్తోంది. ఆ విధంగా చూస్తే వైసీపీకి ఉత్తరాంధ్రా జిల్లాల ఇంచార్జిగా బొత్సని నియమిస్తారు అంటున్నారు. బొత్స సైతం తనకు పార్టీ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో బొత్సను వచ్చే ఏడాది బీసీ కోటాలో ఉత్తరాంధ్రా నుంచి రాజ్యసభకు జగన్ పంపుతారు అన్న టాక్ కూడా ఉంది. అలాగే బొత్సను మంత్రిగా తప్పించినా ఆయన చెప్పిన వారికే మంత్రి పదవి విజయనగరం జిల్లాలో ఇచ్చేందుకు కూడా అధినాయకత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. అలాగే బొత్స కనుక రాజ్యసభ ఎంపీ అయితే ఆయన వారసుడిగా కుమారుడు డాక్టర్ సందీప్ వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారు అని కూడా అంటున్నారు. మొత్తానికి మంత్రిగా మాజీ కావడానికి బొత్స దాదాపుగా ప్రిపేర్ అయ్యారనే టాక్ అయితే విజయనగరం జిల్లాలో నడుస్తోంది.
Tags:    

Similar News