ఆ సీనియర్‌ నేత స్థానంలో చంద్రబాబు సీటు ఇస్తోంది ఆయనకేనా?

Update: 2022-12-07 00:30 GMT
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. మరోవైపు నారా లోకేష్‌ సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న చంద్రబాబు పార్టీ అభ్యర్థులపైనా దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాకినాడ జిల్లా తుని నుంచి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కుటుంబాన్ని పక్కనపెట్టినట్టేనని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి యనమల రామకృష్ణుడు 1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు తుని నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసినప్పుడు యనమల రామకృష్ణుడే శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు.

అయితే గత రెండు ఎన్నికలు 2014, 2019ల్లో తుని నుంచి యనమల రామకృష్ణుడు పోటీ చేయలేదు. ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో ఆయనను పక్కనపెట్టి వచ్చే ఎన్నికల్లో గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో రాజా అశోక్‌ బాబు ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో రాజా అశోక్‌బాబును టీడీపీ అభ్యర్థిగా తుని నుంచి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజా అశోక్‌బాబు.. చంద్రబాబుతో భేటీ కావడం ఇందుకు ఊతమిస్తోంది.

అందులోనూ వరుసగా రెండుసార్లు ఓడిపోతే అలాంటివారికి తర్వాత ఎన్నికల్లోనూ సీటు ఇవ్వబోనని టీడీపీ అధినేత నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా 2014, 2019ల్లో ఓడిపోయిన యనమల కుటుంబానికి సీటు దక్కనట్టే.

ప్రస్తుతం తుని నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. గత రెండు పర్యాయాలుగా ఇక్కడే ఆయనే గెలుస్తూ వస్తున్నారు. ఈసారీ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో దాడిశెట్టి రాజాను ఓడించడానికి టీడీపీ రాజా అశోక్‌బాబును బరిలో దించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు యనమల రామకృష్ణుడు 2014లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. వాగ్దాటి, విషయ పరిజ్ఞానం ఉండటంతో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ యనమల రామకృష్ణుడిని చంద్రబాబు మంత్రిని చేశారు.

తుని నుంచి వచ్చే ఎన్నికల్లో సీటు దక్కే అవకాశం కనిపించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి తన కుమార్తెకు సీటు ఇప్పించుకునే పనిలో యనమల రామకృష్ణుడు ఉన్నారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News