ఈటెలను బీజేపీలోకి వెళ్లేలా చక్రం తిప్పిన ఆ ఇద్దరు నేతలు ఎవరు?

Update: 2021-06-05 05:30 GMT
అంచనాలకు తగ్గట్లే బీజేపీలోకి చేరేందుకు మాజీ మంత్రి.. టీఆర్ఎస్ సీనియర నేత ఈటల రాజేందర్ సిద్ధం కావటం తెలిసిందే. తొలుత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. అనంతరం బీజేపీలో చేరతారని.. ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఘనంగా నిర్వహించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీలోకి ఈటల ఎంట్రీకి కారణం ఎవరు? ఎవరు కీలక పావులు కదిపారు? అన్న ప్రశ్నలతో పాటు.. ఈ ఎపిసోడ్ మొదట్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ ను సైడ్ ట్రాక్ లో పెట్టేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

మంత్రి పదవి నుంచి ఈటలను తప్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఆయన తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి బోలెడన్ని ఆలోచనలు చేసినట్లు చెబుతారు. ఒక దశలో సొంత పార్టీ ఆలోచన కూడా చేసిన ఆయన.. తర్వాత వర్కువుట్ కాదన్న ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు చెబుతారు. దీనికి తోడు.. ఆర్థికంగా తనను ఫిక్స్ చేసేందుకు తనపై పెద్ద ఎత్తున కేసులు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. అదే జరిగితే తన ఆర్థిక మూలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలో ఈటల ఉన్నారు.

ఈ కారణంతోనే తనకు రక్షణ కవచం లభించే అవకాశం ఉన్న బీజేపీలో ఆయన భాగస్వామ్యం అయ్యేందుకు ఓకే చేసినట్లు చెబుతారు. ఈటల మైండ్ సెట్ కు.. ఆయన బాడీ లాంగ్వేజ్ కు బీజేపీ ఏ మాత్రం సూట్ కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. ఈటల ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ ఈటలను బీజేపీలోకి వెళ్లేందుకు ఎవరు కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈటల రాజేందర్ ను బీజేపీలో చేరేందుకు వీలుగా మాట్లాడిన దానిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తే.. మరో సీనియర్ నేత వివేక్ అంతా తానై అన్నట్లుగా చేసినట్లు చెబుతారు. ఈటలను రహస్యంగా కలవటం.. బీజేపీలోకి చేరాల్సిన అవసరం ఏముందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. ఆయన్ను ఒప్పించేందుకు తీవ్రంగా కష్టపడినట్లు చెబుతారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కలిపించేందుకు వివేక్.. కిషన్ రెడ్డి సాయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సూపర్ ట్విస్టు ఏమంటే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సమాచారం లేకుండానే ఇవన్నీ జరిగినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో బండి వర్సెస్ బీజేపీలోని సీనియర్ల గ్రూపు ఒకటి బలంగా తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీనియర్ల గ్రూపులోనే ఈటల సాగుతారన్న మాట వినిపిస్తోంది. ఆయన ఎంట్రీ కూడా వారి వల్లే పూర్తి కావటంతో ఆయన వారికి మరింత విధేయతతో ఉంటారని చెబుతున్నారు.

పార్టీలోకి ఈటల వచ్చేందుకు అవసరమైన గ్రౌండ్ ను వివేక్ ప్రిపేర్ చేస్తే.. ఆ తర్వాత బాధ్యత మొత్తం కేంద్రమంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి చూసుకున్నట్లు చెబుతున్నారు. ఈటల ఎంట్రీ ఏమో కానీ.. తెలంగాణ బీజేపీలో గ్రూపు తగదాలు మరింత పెరిగే వీలుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈటల గొడవలు పెట్టుకునే రకం కాదు.. గొడవల్ని తీర్చే రకమంటున్నారు. మొత్తంగా బీజేపీలోకి ఈటల ఎంట్రీ.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలపై ఎంతోకొంత ప్రభావం పడటం ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News