సైకిలెక్కేందుకు క్యూ...జగన్ సొంత జిల్లాలో మాజీ మంత్రి రెడీ

Update: 2023-02-28 08:00 GMT
వచ్చే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయాలని అనుకుంటారో ఇపుడే నిర్ణయించుకుంటున్నారు. ఒక విధంగా జంపింగ్ జఫాంగులకు టైం వచ్చేసింది. ఎక్కువ మంది ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని చూస్తున్నారు. 2024లో గెలుపు గుర్రం తెలుగుదేశం పార్టీయేనని ముందు చూపు ఉన్న చాలా మంది నాయకులు భావిస్తున్నారు.

దాంతో సైకిలెక్కేందుకు వరసగా క్యూ కడుతున్నారు. జగన్ సొంత జిల్లా కడప నుంచే ఈ హడావుడి ఎక్కువగా ఉంది. ఒకనాడు వైఎస్సార్ కి వీర విధేయుడుగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఆయన మరణాంతరం జగన్ వైపు వచ్చారు. జగన్ పార్టీలో ఆయన కొన్నాళ్ళు కొనసాగారు. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. అయితే జగన్ మీద తిరుగుబాటు చేసి ఆయన తెలుగుదేశం వైపు వెళ్లి మంత్రి అయిపోయారు.

అలా తన చిరకాల కోరిక తీర్చుకున్నారు. మరో వైపు చూస్తే 2019 ఎన్నికల నాటికి ఆయన కడప ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడారు. ఆ మీదట ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. కొన్నాళ్ళ పాటు బీజేపీలో కీలకమైన పాత్ర పోషించారు.

ఇపుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఆయన అడుగులు టీడీపీ వైపుగా పడుతున్నాయని అంటున్నారు. తెలుగుదేశంలో చేరి అసెంబ్లీకి పోటీ చేయాలన్నది ఆదినారాయణ కోరిక అని అంటున్నారు. ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ సంగతి చూస్తే ఆదినారాయణరెడ్డి బలమైన నాయకుడు కాబట్టి ఆయన్ని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా జగన్ కి సొంత జిల్లాలో గట్టి ఝలక్ ఇవ్వాలని చూస్తోంది. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న ఆది చేరికతో మొత్తానికి మొత్తం సమీకరణలు మారుతాయని ఆ విధంగా జగన్ కంచుకోటను కూల్చవచ్చు అని తెలుగుదేశం ఆలోచిస్తోంది అని అంటున్నారు

ఒకవైపు చంద్రబాబు సుదీర్ఘ కాలం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కుప్పం మీద వైసీపీ కన్ను పడింది. అక్కడ ఆయన్ని ఓడిస్తామని వైసీపీ నేతలు చెబుతున్న వేళ కడపలోనే వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ ఆలోచిస్తోంది. ఇదే తీరున ఆదినారాయణ రెడ్డి బాటలో మరికొందరు కూడా సైకిలెక్కాలని చూస్తున్నారు.

ఆ జాబితా తీసుకుంటే నెల్లూరు జిల్లా గుర్తుకు వస్తుంది. అక్కడ మాజీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి బిగ్ షాట్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం వెంకటగిరి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా టీడీపీ నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన సైతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది

అదే జిల్లా నుంచి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇప్పటికే మీడియా ముఖంగా తన కోరిక చెప్పేశారు. ఆ మీదట చంద్రబాబు ఇష్టమని కూడా అన్నారు. అయితే కోటం రెడ్డి ఇలా బయటకు చెప్పినా తెలుగుదేశం నుంచి హామీ తీసుకునే అయన ఈ విధంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.

ఇలా చాలా మంది కడప జిల్లా నేతలతో పాటు నెల్లూరు సహా కీలక జిల్లాల నుంచి తెలుగుదేశం వైపు వస్తున్నారు. మరికొందరు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎవరెటు వెళ్ళినా కూడా ఎక్కువ శాతం మంది మాత్రం తెలుగుదేశం పార్టీనే ఆప్షన్ గా ఎంచుకోవడం రాజకీయ విశేషంగానే చూడాలి. కడప నుంచి ఆదిని సైకిలెక్కించి వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ చూస్తోందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News