వ్యాక్సిన్ పేటెంట్ ర‌ద్దు సాధ్య‌మేనా?

Update: 2021-05-06 15:30 GMT
ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచంలో అమ‌ల్లో ఉన్న ప్ర‌ముఖ చ‌ట్టాల్లో మేథో హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఒక‌టి. ప్ర‌పంచ వ్యాప్తంగా కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతుంటాయి. దానికోసం ఆవిష్క‌ర్త‌లు ఎంతో డ‌బ్బును ఖ‌ర్చు చేస్తుంటారు. దాంతోపాటు మేథ‌స్సును పెట్టుబ‌డిగా పెడుతుంటారు. అంతేకాకుండా.. ఎంతో విలువైన కాలాన్ని కూడా ఖ‌ర్చు చేస్తుంటారు. ఈ మూడు విధాల ఖ‌ర్చుతో ఆవిష్క‌ర‌ణ స‌ఫ‌ల‌మ‌వుతుంది కాబ‌ట్టి.. దానిపై పూర్తి హ‌క్కులు వారివే ఉండాల‌న్న‌ది నిబంధ‌న‌.

అయితే.. వ్యాక్సిన్ల విష‌యంలో ఈ నిబంధ‌న‌లు ర‌ద్దు చేయాల‌న్న‌ది చాలా దేశాల డిమాండ్‌. మ‌నుషుల ప్రాణాల‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి.. ఈ విష‌యంలో పేటెంట్ హ‌క్కును తొల‌గించాల‌నే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు క‌రోనా విల‌య‌తాండం చేస్తున్న నేప‌థ్యంలో ఈ డిమాండ్ మ‌రింత బ‌ల‌ప‌డింది. మొద‌ట‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా ఈ ప్ర‌తిపాద‌న చేశాయి. ఇది జ‌రిగితే.. ప్ర‌పంచానికి ఎక్కువ‌గా టీకాల‌ను ఉత్ప‌త్తి చేసి ఇవ్వ‌గ‌ల‌మ‌ని చెప్పాయి.

మొత్తం 60 దేశాలు ఈ డిమాండ్ చేస్తుండ‌గా.. భార‌త్‌, సౌతాఫ్రికా బ‌లంగా వాద‌న వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో బ్రిట‌న్‌, యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ప‌లు ఫార్మా కంపెనీలు కూడా దీనికి అంగీక‌రించ‌డం లేదు. ఎంతో క‌ష్ట‌ప‌డి, ఖ‌ర్చు చేసి త‌యారు చేసిన వ్యాక్సిన్ల ఫార్ములాను.. ఫ్రీగా ఇత‌రుల‌కు ఎలా ఇస్తామ‌న్న‌ది వీరి వాద‌న‌.

మిగిలిన విష‌యాల్లో ఓకేగానీ.. ఇది ప్రాణాల‌కు సంబంధించిన విష‌యం క‌దా.. కాబ‌ట్టి పేటెంట్ తొల‌గించాల‌న్న‌ది ప్ర‌త్య‌ర్థుల వాద‌న‌. ట్రంప్ హ‌యాంలో.. అమెరికా కూడా ఈ హ‌క్కుల తొల‌గింపును అంగీక‌రించ‌లేదు. కానీ.. బైడెన్ వ‌చ్చిన త‌ర్వాత సానుకూలం నిర్ణ‌యం తీసుకున్నారు. పేటెంట్ తొల‌గిచాల‌న్న వాద‌న‌ను స‌మ‌ర్థించారు. ఈ పోరాటంలో ఇదో గొప్ప ముంద‌డుగు అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే.. ఇది అమ‌లు కావాలంటే ప్ర‌పంచ వ్యాప్తంగా 164 దేశాలు మ‌ద్ద‌తు తెల‌పాల్సి ఉంటుంది. అప్పుడే డ‌బ్ల్యూటీవో నిర్ణ‌యం తీసుకుంటుంది. మ‌రి, ఏం జ‌రుగుతుంది? పేటెంట్ తొలగిపోతుందా? లేదా? అన్న‌ది తెలియాలంటే మ‌రికొంత కాలం ప‌ట్ట‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News