తప్పు కాంగ్రెస్ అధిష్టానందేనా ?

Update: 2022-09-27 04:50 GMT
దేశవ్యాప్తంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి దిగజారిపోయిందో ఆటోమేటిగ్గా అధిష్టానం చాలా బలహీనమైపోయింది. దీన్ని అలుసుగా తీసుకుని కొందరు సీనియర్లు తమిష్టం వచ్చినట్లు తలెగరేస్తున్నారు. తాజాగా రాజస్ధాన్లో జరుగుతున్నదే లైవ్  ఉదాహరణ.

రాజస్ధాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం యువనేత సచిన్ పైలెట్టే. ప్రతిపక్షంలో ఉన్నపుడు చేసిన పోరాటాలు, అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం విషయంలో సచిన్ బాగా కష్టపడ్డారు.

కాబట్టి సహజంగానే సచినే సీఎం అవుతారని అందరు అనుకుంటే ఊహించని రీతిలో అశోక్ గెహ్లాట్ సీఎం అయ్యారు. ఇదే అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పు. ఇలాంటి తప్పే మధ్యప్రదేశ్ లో కూడా చేసింది. ఎన్నికల్లో బాగా కష్టపడిన జ్యోతిరాధిత్య సింథియాను కాదని కమలనాధ్ ను సీఎం చేసింది అధిష్టానం. దాంతో అక్కడ సమస్యలు వచ్చి చివరకు ప్రభుత్వమే కూలిపోయింది. గొడవలు జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం కూలిపోవటానికి కారణం అధిష్టానమే.

మధ్యలో పంజాబ్ లో కూడా అధిష్టానం దాదాపు ఇలాగే చేసింది. అరాచకవాదిగా ముద్రపడిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూని పార్టీలో చేర్చుకోవటమే అధిష్టానం చేసిన తప్పు. సిద్ధూ పార్టీలో చేరిన వెంటనే సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో పాటు అందరితోను గొడవలే.

అందరినీ అంత ఇబ్బంది పెడుతున్న సిద్ధూనే అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిని చేసింది. దాంతో కెప్టెన్ కు సిద్ధూకి ప్రతిరోజు గొడవలే. సిద్ధూ హింసపడలేక ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ రాజీనామా చేయాల్సొచ్చింది. చివరకు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది.

ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే తాను బలహీనపడిన కారణంగానే అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ తప్పుడు నిర్ణయాలే పార్టీ పుట్టి ముంచుతోంది. సరైన సమయంలో సరైన నేతలను కీలకమైన పోస్టులకు ఎంపిక చేసేంత సీన్ అధిష్టానంలో ఇపుడు కనిపించటంలేదు. ఇక మిగిలింది చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒకటే. మరక్కడ ఏమి జరుగుతుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News