ఈసారి కేసీఆర్ కుమార్తె పోటీ అక్క‌డి నుంచేనా?

Update: 2022-08-26 02:30 GMT
తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది చివ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించింద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత పోటీ  చేసే నియోజ‌క‌వ‌ర్గంపైనా ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. క‌ల్వ‌కుంట్ల క‌విత ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని జ‌గిత్యాల నుంచి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో క‌విత నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేతిలో ఓటమిపాల‌య్యారు. ఆ త‌ర్వాత‌ స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు జ‌గిత్యాలలో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున సీనియ‌ర్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి ఉన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న జ‌గిత్యాల నుంచి ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. గ‌త ఎన్నిక‌ల్లో జీవ‌న్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సంజ‌య్ కుమార్ చేతిలో ఓడిపోయారు.

అయితే ఈసారి ప్ర‌స్తుతం జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న‌ డాక్ట‌ర్ సంజ‌య్ కుమార్ కు సీటు ఇవ్వ‌ర‌ని చెబుతున్నారు. ఈ ప్ర‌చారం ఇప్ప‌టికే జోరుగా సాగుతోంద‌ని అంటున్నారు. పార్టీలోనే అస‌మ్మ‌తి పోరుతో ఆయ‌న ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని స‌మాచారం.

అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది జీవ‌న్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీకి జీవ‌న్ రెడ్డి కాంగ్రెస్ త‌రఫున పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పోటీ జీవ‌న్‌రెడ్డి, క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌ధ్యే ఉంటుందని చెబుతున్నారు. బీజేపీ పోటీ చేసినా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి అస‌లు బ‌లం లేద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గిత్యాల నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్య‌ర్థి ర‌వీంద‌ర్‌రెడ్డికి 4,800 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయారు.

కాగా గ‌త ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎంపీగా ఉండి నిజామాబాద్‌లో బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేతిలో క‌ల్వ‌కుంట్ల క‌విత చిత్త‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఈసారి ముందుగానే జ‌గిత్యాలలోనే క‌విత ఇల్లు తీసుకుని ఉంటున్నార‌ని చెబుతున్నారు. పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉండ‌టం, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ప‌ట్టు సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జగిత్యాల జిల్లా రాజకీయం భవిష్యత్తులో రసవత్తరంగా మారే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. జిల్లా కేంద్ర నియోజకవర్గంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News