చంద్రబాబు గతే కేసీఆర్ కూ పడుతుందా?

Update: 2022-09-01 23:30 GMT
రాబోయే ఎన్నికలలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లతో భేటీ అయిన కేసీఆర్ తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను కలవడం చర్చనీయాంశమైంది.

బీహార్ లో పర్యటించిన కేసీఆర్...నితీశ్ కుమార్ తో పాటు బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ లతో భేటీ కావడం ఇటు మీడియాలోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

నితీశ్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీజేపీ ముక్త్ భారత్ కు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం, ప్రదాన ప్రతిపక్షం కాదని, థర్డ్ ఫ్రంట్ మాత్రమే బీజేపీని దీటుగా ఎదుర్కొనగలదని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారిపోయిందని, అది కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీయేతర పార్టీల కూటమే బీజేపీకి ఎదురొడ్డి నిలవగలదని ధీమా వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ కామెంట్లపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వివిధ ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేయడం, ఆ కూటమిలోని సభ్యులంతా ఐకమత్యంగా ఉండేలా చేయడం కత్తి మీద సాము వంటిదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఆ కూటమి గెలిచినా ప్రధాని అభ్యర్థి విషయంలో కచ్చితంగా వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తాయని అంటున్నారు.

ఇక, 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇలాగే బీజేపీయేతర నేతలతో జట్టుకట్టి మోడీని ఓడించేందుకు ప్రయత్నించారని, కానీ, ఇపుడు ఏపీలో టీడీపీ పరిస్థితి ఏమిటని గుర్తుచేస్తున్నారు. 2023 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ కూడా ఏపీలో టీడీపీలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, కేంద్రంలో బలంగా ఉన్న మోదీని గద్దె దించేందుకు కేసీఆర్ ప్రయత్నించడంపై కొందరు నెటిజన్లు ఎమోజీలతో సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక, మరి కొందరైతే నాడు చంద్రబాబు...నేడు కేసీఆర్ అంటూ ఇతర రాష్ట్రాల సీఎంలతో వారిద్దరూ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News