పవన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న పార్టీలు....?

Update: 2022-11-08 00:30 GMT
పవన్ స్వతహాగా ఆవేశపరుడు అని అంటారు. ఆయన ఆవేశంలో ధర్మాగ్రహం ఉంది అని చెబుతారు. అయితే రాజకీయాలో అవేశం కంటే వ్యూహాలే ఎపుడూ విజయాలను సమకూరుస్తాయి. జగన్ 2014 ఎన్నికల ముందు దూకుడుగా వ్యవహరించి గెలుపు చాన్స్ పోగొట్టుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి. ఇపుడు పవన్ కూడా అలా చేయడం వల్ల జనసేనకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అదే టైం లో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండూ కూడా రాజకీయ లబ్ది పొందేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి.

ముందుగా టీడీపీని తీసుకుంటే వైసీపీని బలంగా విమర్శించడానికి తమకు పవన్ లాంటి చరిష్మాటిక్ ఫిగర్ దొరకింది అని సంబరపడుతున్నారు. తాము అనలేని మాటలను, చేయలేని పనులను పవన్ చేస్తూంటే మద్దతుగా ట్వీట్లు వేస్తూ టీడీపీ చక్కగా రాజకీయ కధ నడుపుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ని ఫణంగా పెట్టి మరీ వైసీపీని ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనకు ఫుల్ సపోర్ట్ అన్నట్లుగా టీడీపీ ట్వీట్లు చేస్తున్నా ఏపీ పొలిటికల్ సీన్ లో అంతిమంగా ఈ పరిణామాలు తమకే బెనిఫిట్ గా ఉంటాయన్నదే టీడీపీ లెక్క.

పవన్ వైసీపీని విమర్శిస్తూ అధికార పార్టీని బదనాం చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది. అది టీడీపీకి లాభంగా ఉంటుంది. ఇక పవన్ ఈ విషయంలో కాస్తా హద్దులు దాటి దూకుడుగా వెళ్తున్నారు. దాని వల్ల జనంలో జనసేన ఇమేజ్ కి కూడా మైనస్ మార్కులు పడుతున్నాయి. అలా జనసేనతో ఎంత స్నేహం అంటున్నా తోటి పార్టీ ఎంతో కొంత తగ్గింతే అది కూడా టీడీపీకి అదనపు ప్రయోజనం అని అంటున్నారు. ఈ విధంగా పవన్ భుజం మీద తుపాకీ పెట్టి టీడీపీ పెద్దలు వైసీపీ మీద పేల్చుతున్నారు.

మరో వైపు అధికార వైసీపీ తీరు చూస్తే జనసేనను ఎంత వీలు అయితే అంతలా  రెచ్చగొట్టడం ద్వారా ఆయన సహనం కోల్పోయేలా చేయాలనుకుంటోంది. దీని వల్ల పవన్ కూడా తన రూట్ మార్చేశారు. విశాఖ సంఘటనలు జరగకముందు కాస్తా ఆచీ తూచీ మాట్లాడిన పవన్ ఆ తరువాత నుంచి బిగ్ సౌండ్ చేస్తూ వస్తున్నారు. ఈ టైంలోనే ఆయన ఆవేశాన్ని బయటపెట్టుకుంటున్నారు. దాని వల్ల ఆయన ఆవేశపరుడన్న ముద్ర జనంలోకి వెళ్తోంది.

ఇదే వైసీపీకి కావాల్సింది కూడా. పవన్ దూకుడుగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు కానీ జనాలు ఆయన వైఖరిని కూడా గమినిస్తున్నారని అలా జనసేనకు అది మైనస్ అయితే తమకు అది రాజకీయంగా లాభమని వైసీపీ అంచనా కడుతోంది. పవన్ ఆవేశంలో చేసే అనేక కామెంట్స్ ని జనంలో చర్చకు పెట్టడం ద్వారా జనసేన ఇమేజ్ ని డ్యామేజ్ చేసే పనిలో వైసీపీ బిజీగా ఉంది.

ఈ విధంగా వైసీపీ ట్రాప్ వేస్తే దాంట్లో జనసేనాని పడిపోయారా అన్న చర్చ అయితే వస్తోంది. నిజానికి ప్రజలు ఎవరూ ఆవేశపూరిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వరు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల వేళ జగన్ చంద్రబాబు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే జగన్ అప్పట్లో అన్న కొన్ని పరుషమైన వ్యాఖ్యలను జనంలో పెట్టి చంద్రబాబు రాజకీయ లబ్ది పొందారని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు సేమ్  స్ట్రాటజీని వైసీపీ కూడా అప్లై చేస్తోంది. ఆ విధంగా వైసీపీ పవన్ విషయంలో తాము అనుకున్నట్లుగానే చేస్తోంది. పవన్ లో వీరావేశం పీక్స్ లెవెల్స్ ని జనాలకు చూపించడమే ఆ పార్టీ వ్యూహమని అంటున్నారు. ఇలా టీడీపీ కూడా జనసేన మిత్రుడని చెప్పుకుంటున్నా పవన్ ఇమేజ్ ఇబ్బందులలో పడితే తమకు పోటీ ఉండదని, పైగా రాయబేరాల్లో కూడా తగ్గి ఉంటారన్న లెక్కలేసుకుంటోంది.

మొత్తానికి చూస్తే ఆవేశపూరిత రాజకీయ వైఖరిని జనసేన ఎందుకు తీసుకుందో దాని వల్ల ఆ పార్టీకి ఏ రకమైన రాజకీయ లాభం ఉంటుందో తెలియదు కానీ పవన్ రెచ్చిపోతేనే తాము పచ్చగా ఉంటామని ప్రధాన పార్టీలు రెండూ ఎవరి వ్యూహాలను వారు రూపొందించుకోవడమే ఇక్కడ అసలైన రాజకీయం. మరి ఈ సంగతిని జనసేన తెలుసుకుని మసలుకుంటుందా అన్నదే చూడాల్సిన విషయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News