రామాల‌యం.. 370 ఆర్టిక‌ల్.. బీజేపీ నెక్స్ట్ టార్గెట్‌ అదేనా?

Update: 2021-07-12 12:30 GMT
ఈ దేశంలో హిందూత్వ అజెండాను అమ‌లు చేయాల‌నే సంక‌ల్పంతో ఆవిర్భ‌వించిన సంస్థ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్సెస్). అయితే.. ప్ర‌ధాన నిర్ణ‌యాల‌ను రాజ‌కీయంగా త‌ప్ప‌, మ‌రో విధం సాధించ‌లేమని భావించి ఓ రాజ‌కీయ పార్టీని ఏర్పాటు చేసింది. అదే భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ). ఆరెస్సెస్ అజెండాను బీజేపీ అమ‌లు చేస్తూ ఉంటుంది. అయితే.. సంఘ్ ఎజెండాలో కీల‌క‌మైన అంశాలు చాలానే ఉన్న‌ప్ప‌టికీ.. అత్యంత కీల‌క‌మైన‌వి మూడు విష‌యాలు. అందులో ఒక‌టి రామ‌జ‌న్మ‌భూమిలో ఆల‌యం నిర్మించ‌డం, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డం, ఉమ్మ‌డి పౌర‌స్మృతిని ఏర్పాటు చేయ‌డం. ఇందులో ఇప్ప‌టికే తొలి రెండు ల‌క్ష్యాల‌ను సాధించింది. ఇక‌, మిగిలింది కామ‌న్ సివిల్ కోడ్‌. 2024 ఎన్నిక‌ల్లోగానే ఈ టార్గెట్ కూడా ఛేదించాల‌ని భావిస్తోంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

వాస్త‌వానికి ఉమ్మ‌డి పౌర‌స్మృతి అంశాన్ని 2014 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో కూడా ఉంచింది బీజేపీ. ఇప్పుడు దాన్ని అమ‌ల్లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. అస‌లు ఏమిటీ ఉమ్మ‌డి పౌర‌స్మృతి అన్న‌ప్పుడు.. దేశం మొత్తానికి ఒకే చ‌ట్టం ఉండాలి అనేది డిమాండ్‌. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు పెళ్లి చేసుకోవ‌డం అనేది హిందువుల విష‌యానికి వ‌స్తే.. హిందూ వివాహ చ‌ట్ట ప్ర‌కారం సాగుతుంది. విడాకులు, ద‌త్త‌త స్వీకారం వంటివన్నీ రాజ్యాంగ బ‌ద్ధంగా సాగుతాయి. అదే.. ముస్లింల విష‌యానికి వ‌స్తే.. వాళ్లు రాజ్యాంగాన్ని అనుస‌రించ‌రు. త‌మ మ‌త గ్రంథాల ఆధారంగా ముందుకు సాగుతారు. క్రైస్త‌వుల‌కు ఇండియ‌న్ క్రిస్టియ‌న్ మ్యారేజెస్ యాక్ట్ అమ‌ల్లో ఉంది. ఇత‌ర మ‌తాల వారికి కూడా వేర్వేరు చ‌ట్టాలు ఉన్నాయి. ఇలా కాకుండా.. భార‌త దేశంలో ఉన్న‌వారంతా ఒకే చ‌ట్టానికి అనుగుణంగా న‌డుచుకోవాల‌న్న‌దే ఉమ్మ‌డి పౌర స్మృతి.

అయితే.. ఈ కామ‌న్ సివిల్ కోడ్ ఏర్పాటుకు అస‌లు రాజ్యాంగంలో అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చ కూడా ఉంది. ఈ విష‌యాన్ని ప‌రిశీలించిన‌ప్పుడు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో దీని ప్ర‌స్తావ‌న ఉంది. ఆర్టిక‌ల్ 44లో దేశంలోని పౌరులంద‌రికీ వ‌ర్తించేలా ఒకే చ‌ట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్ర‌భుత్వం కృషి చేయాలి అని రాసి ఉంది. అంతేకాదు.. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ కూడా ఈ విష‌యాన్ని బ‌లంగా స‌మ‌ర్థించార‌ని చెబుతారు. అయితే.. అప్ప‌ట్లో హిందూ-ముస్లిం రెండు వ‌ర్గాలూ దీన్ని వ్య‌తిరేకించ‌డంతో.. ఆచ‌ర‌ణ సాధ్యం కాలేద‌ని అంటారు.

ఉమ్మ‌డి పౌర‌స్మృతి అమ‌ల్లోకి వ‌స్తే.. మ‌తం, కులం, స్త్రీ, పురుషులు అనే తేడాలు లేకుండా దేశంలోని అంద‌రికీ స‌మాన హోదా ల‌భిస్తుంది. క్రిమిన‌ల్‌, సివిల్‌చ‌ట్టాల‌న్నీ అంద‌రికీ స‌మానంగా వ‌ర్తిస్తాయి. లైంగిక స‌మాన‌త్వం, బాహుభార్య‌త్వం నిషేధం, అన్ని మ‌తాల వ‌రు చిన్న కుటుంబాల‌ను అనివార్యంగా పాటించ‌డం వంటివి ఉంటాయి. అయితే.. ఇత‌ర మ‌తాలు మాత్రం దీన్ని మొద‌టి నుంచీ వ్య‌తిరేకిస్తున్నాయి. త‌మ మ‌త ఆచారాల‌కు త‌మ‌ను దూరం చేసే కుట్ర‌గా దీన్ని అభివ‌ర్ణిస్తూ వ‌స్తున్నాయి. అందుకే.. కామ‌న్ సివిల్ కోడ్ కు ముస్లిం, క్రిస్టియ‌న్ల‌తోపాటు ఇత‌రు మ‌తాలు కూడా అంగీక‌రించ‌ట్లేదు. ఇది త‌మ మ‌తాల‌పై జ‌రుగుతున్న దాడిగా చెబుతున్నారు.

ఈ కార‌ణంగానే కామ‌న్ సివిల్ కోడ్ అమ‌ల్లోకి రావ‌ట్లేదు. అయితే.. కేంద్రంలో బీజేపీకి కావాల్సినంత బ‌లం ఉంది. దీంతో.. ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తోంది బీజేపీ. ఇప్ప‌టికే.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 370 ఆర్టిక‌ల్‌, రామ‌జ‌న్మ‌భూమి వివాదాన్ని కంప్లీట్ చేసింది. ఇక‌, మిగిలిన ఉమ్మ‌డి పౌర స్మృతిని కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా తీసుకు రావాల‌ని చూస్తోంద‌ని రాజ‌కీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే.. రామ జ‌న్మ‌భూమి అనేది ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం. 370 ఆర్టిక‌ల్ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన విష‌యం. కానీ.. ఇది మొత్తం దేశానికి, అందులోని అన్ని మ‌తాల‌కు సంబంధించిన విష‌యం. మ‌రి, ఈ విష‌యంలో కేంద్రం ఎలా ఏకాభిప్రాయం సాధిస్తుంద‌న్న‌ది చూడాలి.
Tags:    

Similar News