వైఎస్సార్ చివ‌రి కోరిక అదేనా?

Update: 2022-07-08 11:30 GMT
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ జ‌యంతి వేడుక‌లు తెలంగాణ‌లోనూ ఘ‌నంగా జ‌రిగాయి. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నేత‌లంతా హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ లో వైఎస్సార్ చిత్ర‌ప‌టానికి నివాళులు అర్పించారు. ఆ త‌ర్వాత పంజాగుట్ట‌లోని వైఎస్సార్ కాంస్య విగ్ర‌హానికి నివాళులు స‌మ‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ చివరి కోరిక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమేనని తెలిపారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాసపాత్రుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ ప్ర‌ధానిని చేస్తేనే వైఎస్సార్ ఆత్మకు శాంతి కలుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.  ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి ప‌థ‌కాల‌ను అందించి ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించార‌ని కొనియాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన నాయకుడు వైఎస్సార్ అని ఆయన చెప్పారు. వైఎస్సార్ గొప్ప రాజనీతిజ్ఞుడ‌ని రేవంత్ తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కు హైదరాబాద్‌లో ఆయన స్మృతివనం లేకపోవడం అవమానకరమని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం వైఎస్సార్ స్మృతి వనాన్ని నిర్మించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పని చేయకపోతే అధికారంలోకి వచ్చాక తాము వైఎస్సార్ స్మృతివ‌నాన్ని నిర్మిస్తామ‌ని చెప్పారు. వైఎస్సార్ స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తామని అన్నారు.

మ‌రోవైపు రేవంత్ ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైపు తెలంగాణ‌లో వైఎస్సార్ కూతురు ష‌ర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని ఏర్పాటు చేసి ప్ర‌స్తుతం పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు.

త‌న‌ను గెలిపిస్తే రాజ‌న్న రాజ్యం తెస్తాన‌ని ఊరూవాడా వెలుగెత్తుతున్నారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ త‌మ‌వాడేన‌ని చెబుతోంది. ఆయ‌న‌కు రెండుసార్లు ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌర‌వించింద‌ని గుర్తు చేస్తోంది.
Tags:    

Similar News