భూమనను పక్కన పెట్టినట్లేనా ?

Update: 2022-04-20 06:30 GMT
జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు పార్టీలోని నేతల ఊహలకు కూడా అందటంలేదు. 26 జిల్లాలకు తాజాగా నియమించిన అధ్యక్షులను చూస్తే ఈ విషయం ఇట్టే అర్ధమవుతోంది. తిరుపతి జిల్లాకు చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకరరెడ్డి ఉండగా పక్క నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డిని ఎందుకు నియమించారో ఎవరికీ అర్ధం కావటంలేదు.

 ఇంతకుముందు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (తుడా) ఛైర్మన్ గా కూడా ఇలాగే నియమించారు. మామూలుగా ఎవరైనా తుడా ఛైర్మన్ కు తిరుపతికి చెందిన నేతలనే నియమిస్తుంటారు. కానీ జగన్ మాత్రం చెవిరెడ్డిని నియమించారు. తుడా పరిధిలోకి చంద్రగిరి కూడా వస్తుందన్నది వాస్తవమే. అయినా ఛైర్మన్ గా మాత్రం తిరుపతి నేతలనే నియమించేవారు. తుడా ఛైర్మన్ హోదాలోనే తిరుమల తిరుపతి దేవస్ధానం పాలకమండలిలో చెవిరెడ్డి (టీటీడీ) సభ్యుడయ్యారు.

తుడా ఛైర్మన్ నియామకంతోనే చాలామంది జగన్ నిర్ణయంపై  ఆశ్చర్యపోయారు. అలాంటిది మొన్ననే చెవిరెడ్డికి మరో రెండేళ్ళు ఛైర్మన్ గా పొడిగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇలాంటి నేపధ్యంలోనే తిరుపతి జిల్లాకు అధ్యక్షునిగా నియమించటం ఆశ్చర్యంగానే ఉంది.

నియోజకవర్గంలో భూమన బాగా యాక్టివ్ గానే ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గానే పాల్గొంటున్నారు.

భూమనకు తోడు ఆయన కొడుకు అభినయ్ రెడ్డి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యుటి మేయర్ గా ఉన్నారు. అభినయ్ కూడా యాక్టివ్ గానే ఉన్నాడు. పోనీ వీళ్ళని కాదనుకున్నా మరో సీనియర్ నేతను ఎవరైనా అధ్యక్షునిగా నియమిస్తారని అందరు ఎదురుచూశారు.

అయితే చివరకు అధ్యక్షపదవి కూడా చెవిరెడ్డికే అప్పగించటంతోనే భూమనను జగన్ పక్కన పెట్టేశారా అనే డౌట్లు పెరిగిపోతున్నాయి. మొత్తానికి తిరుపతిలో చెవిరెడ్డి పెత్తనం మాత్రం బాగా పెరిగిపోతోంది. మరి తాజానియామకంపై ఎవరెలాగ రియాక్టవుతారో చూడాల్సిందే.
Tags:    

Similar News