కేసీఆర్ అసలు వ్యూహం అదేనా?

Update: 2020-02-05 04:47 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నోసార్లు జాతీయ రాజకీయాలపై తనకున్న ఆసక్తిని వెలిబుచ్చారు. కిందటి లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ ఆధ్వర్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకుగాను పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. అయితే కొన్ని కారణాలతో ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాలేదు. దీంతో కేసీఆర్ తన ఆలోచనను పక్కకు పెట్టారు అయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధించడంపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఆయన జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు అని చెప్పకనే చెబుతున్నాయి.

* కేసీఆర్ మాస్టర్ ప్లాన్..
ముఖ్యమంత్రి కేసీఆర్ సీఏఏపై దూకుడుగా వ్యవహరించడం వెనుక అసలు ఉద్దేశ్యం జాతీయ రాజకీయాలేనని అర్థమవుతోంది. సీఏఏకు తాను పూర్తి వ్యతిరేకమని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. దీంతో ఆయనకు రెండు విధాలా లాభం చేకూరింది. ఈ నిర్ణయం వల్ల ఎంఐఎం తో దోస్తీ బలపడగా పలు రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకిస్తున్న వాళ్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎంఐఎం వల్ల తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు కాపాడుకోవడంతో దేశంలోని ముస్లింలు తాను చెప్పిందాంట్లో వాస్తవాలు ఉన్నాయనేలా ఆయన మాట్లాడిన తీరు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారని స్పష్టం చేస్తుంది. ‘తాను కూడా హిందువునని.. దేశంలో నేను చేసిన యాగాలు.. మరెవరూ చేయలేదు.. బీజేపీ నాయకులు చెబితేనే నా ఇంట్లో పూజ చేస్తున్నానా?’ అంటూ బీజేపీ టార్గెట్ గా పలు ప్రశ్నలు సంధించారు. దేశానికి ఇలాంటి పద్ధతి మంచిది కాదని హితవు పలుకుతూనే అవసరమైతే తానే ముందుండి సీఏఏ కు వ్యతిరేకంగా పోరాడుతానని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు సీసీఏ బిల్లును సుమోటో గా తీసుకొని కొట్టేయాలని డిమాండ్ చేశారు.

*సీఏఏ వ్యతిరేక శక్తులను కూడగడుతున్న కేసీఆర్..
సీఏఏను వ్యతిరేకిస్తున్న పలు రాష్ట్రాల నేతలతో కేసీఆర్ ఇప్పటికే మాట్లాడినట్లు తెలుస్తోంది. సీఏఏను బలంగా వ్యతిరేకిస్తున్న వారిని ఏకతాటిపైకి తెచ్చి ఈ అంశాన్ని తన జాతీయ రాజకీయాల ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సీఏఏను వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ, స్టాలిన్, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, ప్రశాంత్ కిషోర్, మయావతిలతో కేసీఆర్ టచ్ లో ఉన్నారని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా కేసీఆర్ హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఐఎం నేత అసరుద్దున్ కూడా పలువురు జాతీయ నేతల మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీఏఏకు వ్యతిరేకంగా పోరాడుతూనే బీజేపీ బలం, మోదీ హవా ముందు ఏమాత్రం నిలవలేకపోతోంది. దీంతో సీఏఏపై మార్చి లేదా ఏప్రిల్ లో జాతీయ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం పోరాడేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

అయితే ఇదంతా చాపకిందలా నీరులా సాగిపోతోంది. పైకి ఏమాత్రం కన్పించకుండా గులాబీ బాస్ సైలెంట్ గా పని చేసుకుపోతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తుండటం వల్లనే ఆయన తనయుడు కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహం లో భాగంగానే జరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News