షాకింగ్: స్థానిక ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు లేన‌ట్టేనా..కోర్టు ఏం చెప్పబోతోంది..?

Update: 2021-03-15 14:15 GMT
ఇప్ప‌టి వ‌ర‌కూ ఒకే అభ్య‌ర్థి బ‌రిలో ఉంటే.. ఏక‌గ్రీవం అయిన‌ట్టుగా ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీ. ఎన్నిక‌ల నిబంధ‌న‌లు కూడా అలాగే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో.. వంద‌లాది పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. అయితే.. ఒకే అభ్య‌ర్థి బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఏక‌గ్రీవాలు ప్ర‌క‌టించొద్ద‌ని - ఎన్నిక నిర్వ‌హించాలంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖ‌లైంది.

చిత్తూరు పీపుల్స్ యాక్ష‌న్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎ.రాంబాబు మ‌రికొంద‌రు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఒకే అభ్య‌ర్థి బ‌రిలో ఉన్న‌ప్పుడు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్టు ప్ర‌క‌టించాల‌ని పంచాయ‌తీ ఎన్నిక‌ల నిబంధ‌న‌ 16 స్ప‌ష్టం చేస్తోంది. ఎన్నిక‌ల్లో నోటా కూడా ఉన్నందున ఈ నిబంధ‌న‌ను ప‌క్క‌న పెట్టి ఎన్నిక నిర్వ‌హించాల‌ని, అదేవిధంగా.. ఏక‌గ్రీవాలు ఇచ్చేంద‌కు ప్ర‌భుత్వం జారీచేసిన జీవో34 అమ‌లును నిలిపేయాల‌ని వారు కోరారు. రాబోయే ఎంపీటీసీ - జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు దీన్ని వ‌ర్తింప‌జేయాల‌ని కోర్టును కోరారు.

ఈ పిటిష‌న్ పై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అరూప్ కుమార్ గోస్వామి - న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ చాగ‌రి ప్ర‌వీణ్ కుమార్ ల‌తో కూడిన ధ‌ర్మానం విచార‌ణ చేప‌ట్టింది. ఈ విష‌య‌మై రాష్ట్ర ప్ర‌భుత్వానికి - ఎన్నిక‌ల క‌మిష‌న్ కు నోటీసులు జారీచేసింది. ఈ కేసులో కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని కోరింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 16కు వాయిదా వేస్తూ న్యాయ‌స్థానం ఆదేశాలు జారీచేసింది.
Tags:    

Similar News