ఈ క‌రోనా కొత్త వేరియంట్ మ‌న‌దేశంలోనేనా?

Update: 2022-07-09 05:30 GMT
గ‌త రెండేళ్లు ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా.. ఇటీవ‌ల కొంత శాంతించింది. మ‌ళ్లీ ఇప్పుడు ప‌డ‌గ విప్పుతోంది. మ‌న‌దేశంలో రోజూ దాదాపు ల‌క్ష‌కు కేసులు చేరువవుతున్నాయి. దీంతో మ‌ళ్లీ క‌రోనా కేసులు అందరిలో క‌ల‌వరం క‌లిగిస్తున్నాయి. మ‌రోవైపు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల్లోనూ కేసులు నెమ్మ‌దిగా పెరుగుతున్నాయి. త‌మిళ‌నాడులో ఒక స్కూలులో ఒక్క‌రోజే 31 మంది విద్యార్థుల‌కు క‌రోనా సోక‌డం ఇది మ‌ళ్లీ విజృంభిస్తోంద‌న‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రించ‌డంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

కాగా ఓవైపు క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుంటే మ‌రోవైపు కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయ‌నే వార్త అంద‌రిలోనూ ఆందోళ‌న‌ను రెట్టింపు చేస్తోంది. అందులోనూ ఈ కొత్త వేరియంట్ మ‌న‌దేశంలోనే వెలుగుచూసింద‌నే వార్త డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇజ్రాయెల్ బాంబు పేల్చింది. భారత్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. దీన్ని బీఏ 2.75 వేరియంట్‌గా నిర్ధారించినట్లు పేర్కొంది.

భారత్‌లో కనీసం 10 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం సబ్ వేరియంట్‌ను గుర్తించినట్లు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రకటించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇండియాలో వెలుగుచూసిన ఈ కొత్త వేరియంట్ తో క‌లిపి ఇప్పటివరకు కరోనా సీక్వెన్సులకు సంబంధించిన 85 వేరియంట్‌లను గుర్తించామని అంటున్నారు.

ఈ మేర‌కు ఇజ్రాయెల్ లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన శాస్త్ర‌వేత్ షీఫ్లాన్ ఈ మేరకు ట్వీట్ చేశారు. జూలై 2 నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కోటి, హ‌రియాణాలో ఆరు, హిమాచల్ ప్ర‌దేశ్‌లో మూడు, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో రెండు కలిసి మొత్తం 69 కేసుల్లో కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు షీఫ్లాన్ చెబుతున్నారు. ఈ వేరియంట్ బీఏ 2.75 ఆందోళ‌నకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

మ‌రోవైపు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విష‌యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. భారత్‌ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్‌–వేరియంట్‌ ప్రమాదం ఎక్కువగా ఉందని తన నివేదికలో పేర్కొంది. యూరప్‌–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్ చెబుతున్నారు.

ఈ వేరియంట్‌ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని టెడ్రోస్‌ వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్‌ కేసులు 1,17,893కు పెర‌గ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News