మోదీతో కుమార భేటీ!... బీజేపీ వ్యూహం ఇదే!

Update: 2019-06-15 09:53 GMT
క‌న్న‌డ నాట అధికారంపై క‌న్నేసిన క‌మ‌ల‌నాథులు నిన్న‌టిదాకా ర‌చించిన వ్యూహాన్ని చెత్త బుట్ట‌లో ప‌డేశారు. ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ఈ న‌యా వ్యూహం ఇప్ప‌టికే సిద్ధ‌మైపోగా... ఏకంగా రంగంలోకి కూడా దిగిపోయింది. అధికారాన్ని చేజిక్కించుకోవ‌డ‌మైతే ఖాయ‌మే గానీ... అందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని మాత్ర‌మే బీజేపీ మార్చేసింది. ఈ మార్చిన వ్యూహంతో అస‌లు పార్టీ ఫిరాయింపుల మాటే వినిపించ‌దు. చ‌ట్టాలను ఉల్లంఘించార‌న్న మ‌ర‌కే ప‌డ‌దు. నిజ‌మే మ‌రి... బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చేతిలో రూపొందిన ఈ వ్యూహం క‌ర్ణాట‌క‌లోని సంకీర్ణ స‌ర్కారులో భాగ‌స్వాములుగా ఉన్న రెండు పార్టీల్లో ఓ పార్టీకి గుడ్ న్యూస్ ను చెబుతుండ‌గా, మ‌రో పార్టీని మాత్రం నామ‌రూపాల్లేకుండా చేస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. సరే.. ఈ కొత్త వ్యూహానికి సంబంధించిన ప్ర‌త్యేక‌త‌లు క‌ట్టేసి... అస‌లు ఆ వ్యూహం ఏమిట‌న్న వివ‌రాల్లోకి వెళ్లిపోదాం ప‌దండి.

అమిత్ షా నేతృత్వంలో రూపుదిద్దుకున్న ఈ వ్యూహంలో ప్ర‌త్య‌ర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేల‌ను లాగ‌రు. గంప‌గుత్త‌గా తాను ఎంపిక చేసుకున్న పార్టీనే లాగేస్తారు. గంపగుత్త‌గా పార్టీనే లాగేస్తే... ఇక ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారార‌ని, పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ్డార‌న్న మాటే వినిపించ‌దు కదా. ఈ దిశ‌గానే కాస్తంత మెచ్యూరిటితో ఈ వ్యూహానికి ప‌దును పెట్టిన అమిత్ షా... సంకీర్ణ కూట‌మిలోని జేడీఎస్ తో జ‌త క‌ట్టాల‌ని బీజేపీ యోచిస్తోంది. అంటే.. సంకీర్ణ కూట‌మిలోని మ‌రో పార్టీ కాంగ్రెస్ ను అలా వ‌దిలేసి జేడీఎస్ బీజేపీతో క‌లుస్తుంద‌న్న మాట‌. దీంతో కాంగ్రెస్‌- జేడీఎస్ కూట‌మి క‌రిగిపోయి... కొత్త‌గా బీజేపీ- జేడీఎస్ కూట‌మి ఆవిర్భ‌విస్తుంద‌న్న మాట‌. అంటే కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో సీఎం కుర్చీలో కూర్చున్న జేడీఎస్ నేత కుమార‌స్వామి.. ఇప్పుడు బీజేపీ మ‌ద్ద‌తుతో అదే పోస్టులో కాస్తంత గ‌ట్టిగా, కుదురుగా కూర్చుంటార‌న్న మాట‌.

కాంగ్రెస్ తో జ‌ట్టుక‌ట్టిన నాటి నుంచి ఆ పార్టీ నేత‌ల నుంచి కుమార‌కు ఎప్ప‌టిక‌ప్పుడు త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. అంతేకాకుండా ఏ ప‌ని చేయాల‌న్నా కూడా కాంగ్రెస్ నేత‌లు అడ్డు త‌గులుతున్నారు. దీంతో కాంగ్రెస్ తో ఇంకెన్నాళ్లు వేగేది? అంటూ కుమార ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కుమారుడి ప‌రిస్థితిని చూసి జేడీఎస్ అధినేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ నేరుగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ వ‌ద్ద‌కే వెళ్లి.,.. మీ వాళ్ల‌కు చెబుతారా?  కూట‌మి నుంచి త‌ప్పుకోమంటారా? అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఇదే విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన అమిత్ షా అప్ప‌టిక‌ప్పుడు ఈ కొత్త వ్యూహాన్ని ర‌చించారు. జేడీఎస్ త‌మ వైపున‌కు వ‌చ్చినా సీఎంగా ఆయ‌న‌నే కొన‌సాగించాల‌ని, త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని షా ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ కు కుమార ఓకే అన్నా... సీఎం పీఠం కోసం కాసుక్కూర్చున్న బీజేపీ నేత బీఎస్ య‌డ్యూర‌ప్ప మాత్రం స‌సేమిరా అన్నార‌ట‌. అయితే ఇత‌ర ప‌క్షాల మ‌ద్ద‌తుతో ద‌క్కే సీఎం పోస్టు మ‌న‌కు అవసరం లేద‌ని, సొంతంగా మెజారిటీ సాధించాక సీఎం కుర్చీ నీదేనంటూ నేరుగా అమిత్ షానే చెప్ప‌డంతో ఇప్పుడు య‌డ్యూర‌ప్ప కూడా ఓకే అనేశార‌ట‌.

తాజా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌న్న‌డ‌నాట ఏకంగా 25 ఎంపీ సీట్ల‌ను గెలిచిన బీజేపీ మంచి స్పీడు మీద ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇవే లెక్క‌ల‌ను ప్ర‌స్తావించిన షా... వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ విజ‌యం మన‌దే క‌దా అంటూ షా చెప్ప‌డంతో య‌డ్డీ త‌గ్గార‌ట‌. అంతా అనుకున్న‌ట్లుగానే జ‌రగ‌డంతో జేడీఎస్ తో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు ప్రారంభించార‌ట‌. ఈ చ‌ర్చ‌లు కూడా ఫ‌ల‌వంతంగానే ముగియ‌డంతో నేటి ఉద‌యం నేరుగా ఢిల్లీ వెళ్లిన కుమార‌... ప్ర‌ధాని మోదీని క‌లిసి ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పార‌ట‌. మోదీతో కుమార భేటీ జ‌ర‌గ్గానే... అమిత్ షా ర‌చించిన ఈ న‌యా ప్లాన్ ఒక్క‌సారిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అంటే... అతి త్వ‌ర‌లోనే కాంగ్రెస్ కు క‌టీఫ్ చెప్ప‌నున్న జేడీఎస్‌... కొత్త‌గా బీజేపీతో జ‌త‌క‌డుతుంద‌న్న మాట‌. అప్పుడు కూడా సీఎంగా కుమార‌నే ఉండ‌గా... కొత్త‌గా ఇద్ద‌రు బీజేపీ నేత‌లు డిప్యూటీ సీఎంలుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న మాట‌. ఇంకా బీజేపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌ల‌కు కుమార కేబినెట్ లో కీల‌క మంత్రిత్వ శాఖ‌లు ద‌క్కుతాయ‌న్న మాట‌.


    
    
    

Tags:    

Similar News