బీజేపీ ఎంపీకి చెక్ పెట్టడానికా? సొంత కేబినెట్లో మంత్రిని తొక్కడానికా?

Update: 2019-09-09 07:25 GMT
తెలంగాణలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో విశ్లేషణలు.. మరెన్నో అంచనాలు వస్తున్నాయి. మేనల్లుడు హరీశ్ రావుకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వడం.. తొలిసారి మహిళలకు స్థానం కల్పించడం.. కమ్యూనిస్టు నేత కుమారుడికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు పాత కరీంనగర్ జిల్లా నుంచి గంగుల కమలాకర్‌ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం కూడా చర్చనీయమవుతోంది. ఇప్పటికే పాత కరీంనగర్ జిల్లా నుంచి కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ ఉండగా ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే - సీఎం కుమారుడు కేటీఆర్‌ ను - అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్‌ ను తీసుకోవడంతో నలుగురయ్యారు. కమలాకర్‌ చాలాకాలంగా మంత్రి పదవి కోరుకుంటున్నప్పటికీ ఇప్పుడు హఠాత్తుగా ఆయనకు అవకాశమివ్వడానికి కారణం బీజేపీ విస్తరణను అడ్డుకోవడానికే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే.. కేసీఆర్ అసలు ఉద్దేశం అది కాదని.. సొంత పార్టీకే చెందిన ఓ మంత్రికి చెక్ పెట్టేందుకు కమలాకర్‌ ను అస్త్రంలా వాడుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కమలాకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచీ దూకుడు గల నేతే. ఆయన దూకుడే ఆయన్ను రాజకీయాల్లో వేగంగా ఎదిగేలా చేసింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి ఇవ్వడానికి కారణం అక్కడ అదే సామాజికవర్గం నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలవడమేనని.. బీజేపీకి చెందిన సంజయ్ పార్టీని శరవేగంగా విస్తరిస్తుండడంతో ఇప్పుడు ఆయన జోరుకు అడ్డుకట్ట వేసేందుకు కమలాకర్‌కు మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారని వినిపిస్తోంది.

ఇది కారణమైతే కావొచ్చు కానీ... అంతకుమించిన మరో కారణం ఉందని టీఆరెస్ నేతలే అంటున్నారు. ఇటీవల కేసీఆర్‌ తో వ్యవహారం పూర్తిగా చెడిన మంత్రి ఈటెల రాజేందర్‌ ను తొక్కే ప్రయత్నంలోనే కమలాకర్‌ ను రంగంలోకి దించారని వినిపిస్తోంది. మృదుస్వభావి అయిన ఈటెల‌ గంగుల దూకుడును తట్టుకోవడం కష్టమని.. క్రమంగా ఆయన్ను తెరమరుగు చేయడానికి గంగులే సరైన అస్త్రమని కేసీఆర్ భావించినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల రెవెన్యూ వ్యవహారంలో ఈటెలపై టీఆరెస్‌ లో వ్యూహాత్మకంగా దుష్ప్రచారం జరగడం.. ఈటెల తీవ్రంగా స్పందించడంతో కేసీఆర్ - ఈటెల మధ్య సంబంధాలు పూర్తిగా చెడ్డాయని అందరికీ అర్థమైపోయింది. దీంతో ఒక దశలో ఈ విస్తరణలో ఈటెలను తప్పిస్తారన్న ప్రచారమూ జరిగింది. కానీ.. ఈటెలను మంత్రివర్గంలో కేసీఆర్ కొనసాగించారు.. కానీ, ఆయన చేతిలోనే కీలక ఆర్థిక శాఖను మేనల్లుడు హరీశ్ రావుకు కట్టబెట్టారిప్పుడు. మొత్తానికి ఈటెల ఫ్యాక్టర్ - బీజేపీ భయం రెండూ కలిసి కమలాకర్‌కు అదృష్టం తెచ్చిపెట్టింది.
Tags:    

Similar News