వంగవీటికి బీజేపీ ఒక్కటే మిగిలిందా?

Update: 2020-08-22 04:45 GMT
వంగవీటి రంగా.. విజయవాడను షేక్ చేసిన కాపునాయకుడు. ఆయన అభిమాన గణం అప్పట్లో విజయవాడను ఏలింది. ఏపీలో ఒక వర్గానికి ఆయన సారథ్యం వహించారు. ఇప్పటికీ బెజవాడలో ఆయనకు ప్రాణమిచ్చే  అభిమానులున్నారు. కానీ తండ్రి వారసత్వం అందిపుచ్చుకోవడంలో ఆయన కుమారుడు వంగవీటి రాధ విఫలమయ్యాడనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

వంగవీటి రాధాకృష్ణ తన తండ్రి రంగా వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగించలేకపోతున్నారు.  పైగా ప్రసిద్ధ తండ్రిని పోలి ఉన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా నాయకుడిగా నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల వరకు ఉన్నారు.

అయితే వంగవీటి రాధా చేసిన పెద్ద పొరపాటు 2019 ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడం. టీడీపీలో కూడా ఆయనకు కావలసిన టికెట్ దక్కలేదు. జగన్ వైసీపీ సునామీలో రాధా తుడిచిపెట్టుకుపోయాడు. ప్రస్తుతం టీడీపీలో సైలెంట్ గా ఉంటున్నారు.

వంగవీటి రంగా వారసుడు రాధాకు రాజకీయాలు కలిసి రాలేదని అర్థమవుతోంది. అంతపెద్ద నాయకుడి కుమారుడు సక్సెస్ కాలేకపోవడం ఆయన స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. 2019లో వైసీపీలోనే ఉంటే ఇప్పుడు ఆయన వేరేలా ఉండేదని చెప్పవచ్చు.  

కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి పెద్ద తప్పే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తండ్రి రంగా హత్యకు టీడీపీనే కారణం అన్న ప్రచారం రాజకీయవర్గాల్లో బలంగా వినిపించింది. ఇప్పటికీ రంగా అభిమానులు అదే చెబుతుంటారు.  అలాంటిది రాధా అదే పార్టీలో చేరడంతో.. తండ్రిని చంపిన పార్టీలో చేరి తప్పు చేశాడనే అపవాదు.. విమర్శలు బాగా వినిపించాయి.

ఇప్పుడు తాజా అప్ డేట్ ఏంటంటే రాధా మళ్లీ టీడీపీ వీడి బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు హైదరాబాద్ లో ఆ పార్టీ కేంద్రమంత్రితో రాధా సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రాధాకు ఇప్పుడు బీజేపీ లేదా జనసేన తప్పితే మరో ఆప్షన్ లేదు. వైసీపీ రానీయదు.. టీడీపీలో ఉండలేడు. జనసేన బలంగా లేదు. ఇలా గొప్ప నాయకుడి కుమారుడు రాజకీయ తప్పటడుగులతో జనాల్లో ఫెయిల్ అయ్యాడని ఆయన అభిమానులు వాపోతున్నారు.
Tags:    

Similar News