వైఎస్ జ‌గ‌న్ ఆ టీవీ చాన‌ళ్ల రేటింగుల‌ను పెంచుతున్నారా?

Update: 2022-07-12 16:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ త‌న స‌భ‌ల్లో, మంత్రి మండ‌లి స‌మావేశాల్లో, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్చార్జుల‌తో నిర్వ‌హించే మీటింగుల్లో దుష్ట చ‌తుష్ట‌యం అంటూ కొన్ని టీవీ చానెళ్లు, ఒక అత్య‌ధిక స‌ర్క్యులేష‌న్ గ‌ల ప‌త్రిక‌పై నిప్పులు చెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. వాటిని సీఎం జ‌గ‌న్ తోపాటు వైఎస్సార్సీపీ నేత‌లు ఎల్లో మీడియా అని పిలుస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వంపై ఈ ఎల్లో మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేయ‌డం చేస్తున్నాయ‌ని జ‌గ‌న్ ఆరోపిస్తున్నారు. త‌మ‌వాడు చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా లేడ‌ని చెప్పి త‌న ప్ర‌భుత్వంపై అస‌త్య క‌థ‌నాలు, త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డుతున్నారు.

వాస్త‌వానికి వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక రెండు టీవీ చానెళ్లను ఏపీలో రాకుండా చేశారు. కేబుల్ ఆప‌రేట‌ర్ల‌తో మాట్లాడి రాష్ట్రంలో ఎక్క‌డా ఆ రెండు చానెళ్ల ప్ర‌సారాలు రాకుండా అన‌ధికార నిషేధం విధించారు. అయితే ఒక టీవీ చానెల్ ను మాత్రం ఏం చేయ‌కుండా వ‌దిలేశారు. అలాగే రెండు టీవీ చానెళ్ల‌కు చెందిన రెండు ప‌త్రిక‌ల‌పై కూడా సీఎం జ‌గ‌న్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరాటం కేవ‌లం చంద్ర‌బాబు నాయుడుతో మాత్ర‌మే కాద‌ని.. ఎల్లో మీడియాతో కూడా అని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొస్తున్నాయి కాబ‌ట్టి ఎల్లో మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డానికి సిద్ధం ఉంటుంద‌ని ప‌లు స‌మావేశాల్లో త‌న పార్టీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

అంతేకాకుండా ఇటీవ‌ల జూలై 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ స‌మీపంలో నిర్వ‌హించిన ప్లీన‌రీలో ఎల్లో మీడియాపై ప్ర‌త్యేకంగా తీర్మానం కూడా ప్ర‌వేశ‌పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ తీర్మానంపై మాట్లాడిన‌ మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, జోగి రమేష్ తదిత‌రులు ఆ ప‌త్రిక‌, టీవీ చానెళ్ల యాజ‌మాన్యాల‌పై నిప్పులు చెరిగారు.

మ‌రోవైపు జ‌గ‌న్ సొంత ప‌త్రిక.. మ‌రో అగ్ర ప‌త్రిక ప్ర‌భుత్వంపై ఇచ్చే వ్య‌తిరేక క‌థ‌నాల‌కు ఏది నిజం పేరుతో కౌంట‌ర్లు ఇస్తోంది. రోజూ అత్య‌ధిక పాఠ‌కాద‌ర‌ణ క‌లిగిన ప‌త్రిక జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏదో ఒక వ్య‌తిరేక క‌థ‌నం ఇస్తోంది. మ‌రుస‌టి రోజు జ‌గ‌న్ దిన‌ప‌త్రిక‌లో ఏది నిజం పేరుతో కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇందుకోసం జ‌గ‌న్ ప‌త్రిక‌లో ఎడిటోరియ‌ల్ పేజీని వాడుకుంటున్నారు. దీంతో నిపుణుల ఆర్టిక‌ల్స్ ను కోల్పోతున్నామ‌ని పాఠ‌కులు ఆవేద‌న చెందుతున్నారు.

అయితే తానొక‌టి త‌ల‌స్తే.. దైవం ఒక‌టి త‌లచిన‌ట్టు సీఎం జ‌గ‌న్ తోపాటు వైఎస్సార్సీపీ నేత‌లు రెండు ప‌త్రిక‌ల‌ను, మూడు టీవీ చానెళ్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటుంటే.. ఆ టీవీ చానెళ్ల రేటింగులు, ఆ రెండు ప‌త్రిక‌ల స‌ర్క్యులేష‌న్ బాగా పెరుగుతున్నాయ‌ని అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఆ మూడు టీవీ చానెళ్లు రాకుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్నా వాటికి యూట్యూబులో ఎక్క‌డ లేని పాపులారిటీ ఉంద‌ని చెబుతున్నారు. ఆ టీవీ చానెళ్ల వీడియోల‌ను ల‌క్ష‌ల సంఖ్య‌లో వీక్షిస్తున్నారు. ప్ర‌భుత్వంపై సంబంధిత క‌థ‌నాలు పెట్టీ పెట్ట‌గానే ఒక్క‌రోజులోనే మిలియ‌న్ల కొద్దీ వ్యూస్ వ‌స్తున్నాయి. అలాగే యూట్యూబులోనే లైవ్ టీవీ ప్ర‌సారాల‌ను వీక్షిస్తున్నారు.

ఆ చానెళ్ల వీడియో క్లిప్పింగుల‌ను క‌ట్ చేసి వీక్ష‌కులు సోష‌ల్ మీడియాలోనూ పోస్టు చేస్తున్నారు. దీంతో ఆ చానెళ్ల‌కు సోష‌ల్ మీడియాలోనూ మంచి పాపులారిటీ ల‌భిస్తోంది. అలాగే ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్ లోనూ ఆ చానెళ్ల వీడియోల‌ను భారీ స్థాయిలో వీక్షిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆ టీవీ చానెళ్ల‌ను ఎందుకు ల‌క్ష్యం చేసుకున్నారు? అస‌లు వాటిలో ఏముందో తెలుసుకోవాల‌ని భారీ సంఖ్య‌లో వీక్ష‌కులు వాటిని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత‌లు, సోష‌ల్ మీడియా విభాగం కూడా ఎల్లో మీడియా అంటూ ఆ మూడు టీవీ చానెళ్లు, రెండు ప‌త్రిక‌ల‌పై ధ్వ‌జం ఎత్తుతుండ‌టంతో ప్ర‌జ‌ల్లో స‌హ‌జంగానే ఒక ఆస‌క్తి రేగుతోంది. దీంతో వారంతా ఆ చానెళ్ల‌ను యూట్యూబులో వీక్షిస్తున్నారు. దీంతో ఆ చానెళ్లు యాడ్స్ రెవెన్యూ రూపంలో భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి.

గ‌తంలో వైఎస్ జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా ఆ రెండు ప‌త్రిక‌లు అంటూ వాటిని టార్గెట్ చేసుకునేవారు. ఆ రెండు ప‌త్రిక‌ల‌ను అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా తీసుకొచ్చి ఆ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాల‌ను చ‌దువుతూ వాటిని దునుమాడేవారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా త‌న తండ్రి బాటలోనే న‌డుస్తున్నారు. త‌ద్వారా వాటికి ఎక్క‌డ లేని ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. ప్ర‌జ‌ల్లో వాటి రీచ్ పెంచుతున్నారు.
Tags:    

Similar News