ఐసిస్‌ కు క‌ష్టం ఎదురైతే భార‌త్‌ కే న‌ష్టం

Update: 2016-12-31 06:47 GMT
తీవ్రవాదం వేళ్లూనుకుపోయిన క్ర‌మంలో దానికి అంతా ఏ విధంగా బ‌లి అవుతార‌నేందుకు ఇదే నిద‌ర్శ‌నం. సిరియాలో ఆరేళ్ల‌ నిరంతర అంతర్యుద్ధం ఎట్టకేలకు ఆగిపోయిన‌ట్లుగా క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప‌రిణామం భార‌త్‌కు శాపంగా మారే అవ‌కాశం ఉంద‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఎలా అంటే భారత్‌ నుంచి వెళ్లి ఇస్లామిక్‌ స్టేట్‌ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి. వీరంతా ఆశ్ర‌యం పొందిన ఐసిస్‌ కు ఇటీవ‌ల సిరియాలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో వీరు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నార‌ట‌.

ఈ క్ర‌మంలో సిరియాలో దిక్కుతోచ‌క‌పోవ‌డంతో స‌ద‌రు ముష్క‌రులు సొంత దేశ‌మైన భార‌త్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. అలా వ‌చ్చిన త‌మ మూర్ఖ‌పు బుద్ధిని వ‌దిలిపెట్ట‌కుండా ఇక్క‌డ సైతం ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని నిఘా వర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇది మ‌న‌దేశంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఇబ్బందిగా మారుతుంద‌ని స‌ద‌రు వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇదిలాఉండ‌గా... త‌మ దేశంలో శాంతి ఒప్పందం అమలులోకి వచ్చినట్లు సిరియా సైన్యం ప్ర‌క‌టించింది. అక్కడక్కడా కాల్పులు జరిగినా మొత్తం మీద దేశంలో ఇప్పుడు నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. రష్యా - టర్కీల మధ్యవర్తిత్వంతో పోరాట విరమణకు ప్రభుత్వం, పలు తిరుగుబాటువర్గాలు అంగీకరించాయి. రష్యా అధ్యక్షుడు సైతం శాంతి ఒప్పందం గురించి ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News