ఇంకా భ‌యంలోనే సాఫ్ట్‌ వేర్‌: ఇంకొన్నాళ్లు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమే

Update: 2020-06-07 09:03 GMT
భార‌త‌దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. అన్ని రంగాలు మూత‌ప‌డ్డాయి. అయితే వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌లేమ‌ని అన్ని దేశాలు గుర్తించి దానితో స‌హ‌జీవ‌నానికి సిద్ధ‌మ‌య్యారు. ఇక ఇంట్లో ఉండి ఏం చేయ‌లేమ‌ని గుర్తించి స్వీయ జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే ప్ర‌జ‌లంతా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. అన్ని వ్యాపారాలు, రంగాలు త‌మ కార్యక‌లాపాలు మొద‌లెట్టాయి. ఈ ఈ క్రమంలోనే సాఫ్ట్‌వేర్ రంగం కూడా ఇప్పుడిప్పుడే కార్యాల‌యాలు తెర‌వ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అయితే భార‌త్‌ లో మ‌రింత తీవ్రంగా వైర‌స్ వ్యాప్తి ఉండ‌డంతో ముందు జాగ్ర‌త్త‌గా గ‌తంలో మాదిరే ఇంటి నుంచే ప‌ని చేయ‌డానికి ఉద్యోగుల‌కు అవ‌కాశం ఇస్తోంది. మ‌రికొన్నాళ్ల పాటు ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని ఆయా సంస్థ‌లు ఉద్యోగుల‌కు స‌మాచారం ఇస్తున్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం దృష్ట్యా ఆయా యాజ‌మాన్యాలు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గుచూపుతున్నాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, పూణే, సూరత్‌లలో ఉద్యోగుల్లో అధికంగా ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు.

లాక్‌డౌన్‌తో ‌మూడు నలలుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. మ‌రికొన్నాళ్లు కార్యాల‌యాల‌కు రాకుండా ఇళ్ల‌ల్లోనే ప‌ని చేయాల‌ని ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులు కార్యాలయాలకు రావొద్ద‌ని సూచిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో కేవలం 15 శాతం ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు. మిగతా వారంతా ఇంట్లో ఉండి పని చేస్తున్నారు. అయితే ఇంట్లో ఉండి ప‌ని చేయ‌డం ద్వారా ఉద్యోగుల ప‌నితీరు, విధుల్లో నాణ్యత ఏ మాత్రం మార్పులేదని ఇన్ఫోసిస్ గుర్తించింది. కార్యాల‌యాల్లో మాదిరే వర్క్‌ ఫ్రమ్ హోమ్‌లో కూడా ఉద్యోగులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని మిడ్‌ టైర్ వంటి కంపెనీలు చెబుతున్నాయి.

ఈ విష‌య‌మై విప్రో కూడా అంగీక‌రించింది. వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ ద్వారా త‌మ ఉద్యోగులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నట్లు విప్రో ప్ర‌క‌టించింది. టెక్ మ‌హీంద్రా మాత్రం స్థానిక పరిస్థితుల ఆధారంగా ఉద్యోగుల విధుల విష‌య‌మై నిర్ణయాలు తీసుకుంటున్న‌ట్లు తెలిపింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితిలో 10 మంది ఉద్యోగుల్లో 7 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయ‌డానికి ఇష్టపడుతుండ‌డంతో యాజ‌మాన్యాలు కూడా ఆ విధంగానే నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి. ప్రయాణ సమయం తొలగపోవ‌డంతో పని గంటల్లో గణనీయ మార్పులు కనిపిస్తున్నాయ‌ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు గుర్తించారు. అందుకే ఎప్పుడూ లేనిది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి.


Tags:    

Similar News