టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్: పార్టీ మారింది మాట మారుతుందా?

Update: 2022-12-09 04:37 GMT
ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి వేరు కాపురం పెట్టేందుకు ప్రయత్నించి.. విజయం సాధించటం చాలామంది చేసేదే. అయితే.. అలా వేరు కాపురం పెట్టిన తర్వాత.. మరో పెద్ద కాపురం కోసం ప్రయత్నాలు చేయటమే అరుదుగా జరుగుతుంటుంది. తాజాగా అలాంటిదే ఒక ప్రాంతీయ పార్టీ విషయంలో చోటు చేసుకుంది. ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం గురువారంతో ముగిసింది. తమ పార్టీ పేరును టీఆర్ఎస్ స్థానే బీఆర్ఎస్ గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపేసింది. దీంతో.. పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చటానికి ఎలాంటి ఇబ్బందులు లేనట్లే.

తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు కేసీఆర్ నిర్ణయించటం.. ఆ కీలక నిర్ణయాన్ని దసరా రోజున ప్రత్యేక మీడియా సమావేశంలో కేసీఆర్ వెల్లడించటం తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ నిర్ణయానికి ఓకే చెప్పేస్తూ నిర్ణయం తీసుకుంది. పేరు మార్చటానికి సంబంధించిన ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు. ఇక.. తర్వాత జరిగేదంతా సాంకేతికమే తప్పించి.. అందులో మరెలాంటి ట్విస్టులు ఉండని పరిస్థితి.

ప్రాంతీయ పార్టీగా.. తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో మొదలైన ఈ పార్టీ ఈ రోజున తాను అనుకున్నది సాధించటమే కాదు.. ప్రత్యేక రాష్ట్రంలో సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఎనిమిదిన్నరేళ్లుగా అప్రతిహతంగా తన అధికారాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తన పరిధిని తెలంగాణకు పరిమితం చేసే స్థాయి నుంచి ఈ రోజున జాతీయ స్థాయిలో పార్టీని తీసుకెళ్లేందుకు కేసీఆర్ వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని ప్రకటించటం బాగానే ఉన్నా.. గులాబీ దళానికి అదెంత వరకు సూట్ అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

కారణం.. టీఆర్ఎస్ ఏర్పాటు పూర్తిగా తెలంగాణ ప్రాంతంలోని వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయటం.. వారి హక్కుల కోసమే తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన వాదాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు దేశ ప్రజల ప్రయోజనాల గురించి వాదనలు వినిపించే టైం వచ్చేసింది. మరి.. ఆ పాత్రకు గులాబీ అధినాయకత్వం సిద్దంగా ఉందా? అన్నది ప్రశ్న. ఈ రోజున తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే.. సీమాంధ్రులంటూ ఆమెను ఎక్కెసం చేయటం తెలిసిందే.

నిజంగానే షర్మిల సీమాంధ్రకు చెందిన వ్యక్తేనా? అన్న ప్రశ్నను చూస్తే.. ఆమె పుట్టింది సీమలో అయినా.. పెరిగింది.. చదువుకున్నది.. పెళ్లి చేసుకున్నది తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే. అలాంటప్పుడు తాను ఏపీ మహిళగా ఎలా చూస్తారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు తమ పార్టీని జాతీయ పార్టీగా మార్చేస్తున్న వేళ.. ప్రాంతీయ వాసనల్ని ప్రదర్శించటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్నగా మారింది.

ఇదే తరహా మాటలురానున్న కాలంలో వినిపిస్తే ఏ మాత్రం బాగోదని.. జాతీయ పార్టీ స్థాయికి ఏ మాత్రం సరి కావంటున్నారు. పార్టీ పేరు మారినంతనే.. మొత్తం తీరు మారిపోవటం సాధ్యం కాదంటున్నారు. ఏమైనా.. నిన్న మొన్నటివరకు వెనుకా ముందు లేకుండా మాట్లాడేసిన కేసీఆర్ అండ్ కో ఈ రోజు నుంచి తమది జాతీయ స్థాయి పార్టీ అన్న రీతిలో రియాక్టు కావాల్సి ఉంటుంది. ఈ విషయంలో తేడా వచ్చినా అభాసు పాలు కావటం ఖాయం. ప్రాంతీయ పార్టీ అధినేతగా ఫుల్ మార్కులు కొట్టేసిన కేసీఆర్.. జాతీయ పార్టీ అధినేతగా ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తారన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News