మంత్రి నారాయణ అనుచరుడి ఇంట్లో ఐటీ రైడ్స్

Update: 2016-12-28 07:12 GMT
నల్ల కుబేరుల దుమ్ము దులుపుతున్న ఐటీ శాఖ తాజాగా ఏపీ మంత్రి నారాయణపైనా కన్నేసినట్లు కనిపిస్తోంది. దేశంలోనే అత్యంత ధనిక మంత్రిగా రికార్డులకెక్కిన నారాయణ ఇప్పుడు ఐటీ నజర్ లో ఉన్నట్లు పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. నారాయణకు అత్యంత సన్నిహితుడైన డాక్టర్ గుణశేఖర్ ఇంటిపై ఐటీ దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో భారీగా బంగారం - నగదు దొరికాయట.
    
తిరుపతి భవానీనగర్‌ లోని ఆయన నివాసంపై దాదాపు 27మంది ఐటీ అధికారుల బృందం రైడ్ చేసింది. గుణశేఖర్ బంధువులు - స్నేహితుల ఇళ్లపైనా దాడులు చేశారు. గుణశేఖర్ ఇంట్లో భారీగా నగదు - బంగారం బయటపడింది. వాటిని లెక్కించేందుకు ఐటీ అధికారులు క్యాష్ కౌంటింగ్ మిషన్లు - బంగారం తూచేందుకు వెయింగ్ మిషన్లకు అప్పటికప్పుడు తెప్పించారు. కిలోల కొద్ది బంగారం - కోట్లలో నగదు బయటపడినట్టు సమాచారం. కీలకమైన పత్రాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రంతా సోదాలు కొనసాగాయి. బుధవారం ఉదయం ఐటీ దాడుల అంశాన్ని అధికారులు ధృవీకరించారు.
    
కాగా గుణశేఖర్ ను మంత్రి నారాయణకు బినామీ అని చెబుతుంటారు. మంత్రి సాయంతోనే గుణశేఖర్ భారీగా ఆస్తులు, బంగారం, నగదు కూడబెట్టినట్టు చెబుతున్నారు.  తాజా పరిణామాలతో నారాయణ షాక్ కు గురయ్యారని టాక్. అయితే.. ముందు జాగ్రత్తగా ఆయన తన వరకు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుకు నమ్మకస్థుడైన నారాయణను చంద్రబాబు బయటపడేస్తారో లేదో చూడాలి. ఎందుకంటే... కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మంత్రివర్గంలోని వ్యక్తిపై ఒక వేళ ఐటీ శాఖ దాడులు చేస్తే అది పరువు పోయే చర్యే అవుతుంది. కాబట్టి అంతవరకు రాకుండా చంద్రబాబు కాపాడుతారని భావిస్తున్నారు. నారాయణ కూడా అదే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News