హైద‌రాబాద్ లో ఇవాంకా కాన్వాయ్ ఇలా ఉంటుంద‌ట‌

Update: 2017-11-14 06:30 GMT
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ముద్దుల కుమార్తెఓ ఇవాంకా హైద‌రాబాద్ వ‌చ్చేసే టైం దగ్గ‌ర‌కు వ‌చ్చేసింది. మ‌రో రెండు వారాల్లో ఆమె హైద‌రాబాద్‌కు రానున్నారు. ఆమె ట్రిప్ సంద‌ర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైద‌రాబాద్  ట్రిప్ సంద‌ర్భంగా ఆమె కాన్వాయ్ లో ఉండే వాహ‌నాల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 60 కార్లు ఉంటాయ‌ట‌. ఇక‌.. ఇవాంకా వాడే కార్ల‌ను అమెరికా నుంచే తెప్పిస్తున్నార‌ట‌.

అధికారులు ఉప‌యోగించే కార్ల‌తో పాటు.. ఇవాంకా వినియోగించే కార్ల‌ను ప్ర‌త్యేక విమానాల్లో హైద‌రాబాద్‌కు తేనున్నారు. దాదాపు ప‌దిహేను నుంచి ఇర‌వై వాహ‌నాలు అమెరికా నుంచి రానున్నాయి. ఇవాంకా అధికార గ‌ణం వినియోగించే కార్ల‌లో ఒక్కో కార్లో ఒక డ్రైవ‌ర్ తో పాటు వెనుక సీట్లో ఇద్ద‌రు అధికారులు మాత్ర‌మే కూర్చుంటారు. ఇక‌.. భ‌ద్ర‌తా అధికారులు వినియోగించే కార్లు క‌లిపితే మొత్తంగా ఆమె కాన్వాయ్ 60 కార్ల‌తో ఉండ‌నుంది.

హైద‌రాబాద్ లో ఆమె వెస్టిన్ హోట‌ల్లో బ‌స చేయ‌నున్నారు. ఇక‌.. హోట‌ల్ నుంచి స‌ద‌స్సు జ‌రిగే వేదిక‌కు.. అక్క‌డ నుంచి ఆమె విందుకోసం రానున్న ఫ‌ల‌క్‌నుమా హెట‌ల్‌కు వెళ్లే రూట్ విష‌యంలో మ‌రో రెండు రోజుల్లో ఫైన‌ల్ చేయ‌నున్నారు. రెండు రూట్ల‌ను సిద్దంగా ఉంచనున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న‌కు కొద్ది రోజుల ముందే.. ఇవాంకా వెళ్లే రూట్‌ను నిర్ణ‌యించారు.

ఇవాంకా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా డిన్న‌ర్ కోసం పాత‌బ‌స్తీలోని ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ కు రానున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. అక్క‌డ కాన్వాయ్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీలుగా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోనున్నారు. ఇవాంకా షాపింగ్ చేయాల‌న్న ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తే.. ప‌రిస్థితి ఏమిట‌న్న అంశంపైనా అమెరికా నిఘా అధికారులు దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాంకా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా అమెరికా సీక్రెట్ స‌ర్వీస్ ప‌లు విధాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఆమె బ‌స చేసే హోట‌ల్ తో పాటు.. విందుకు వెళ్లే ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ హోట‌ల్ ను అమెరికాభ‌ద్ర‌తా సిబ్బంది త‌మ అధీనంలోకి తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌డిచిన‌ప‌ది రోజులుగా ఆ హోట‌ళ్ల‌కు వెళ్లే అతిధుల విష‌యంలోనూ.. ఇత‌రుల విష‌యంలో ఆంక్ష‌ల్ని విధించిన‌ట్లుగా స‌మాచారం. కాన్వాయ్ కోసం ఉప‌యోగించే వాహ‌నాలతో పాటు.. ఇవాంకా భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన అత్యాధునిక ఆయుధాలు.. ప‌రిక‌రాల్ని ప్ర‌త్యేకంగా అమెరికా నుంచి తెప్పించ‌నున్నారు. భ‌ద్ర‌త‌లో భాగంగా హైద‌రాబాద్ తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లోనూ ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్న‌ట్లు చెబుతున్నారు. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని సెల్ ఫోన్ల‌పైనా ప్ర‌త్యేక నిఘా పెట్టిన‌ట్లుగా తెలుస్తోంది.

ఫ‌ల‌క్ నుమా ప‌రిస‌రాల్లో ప్ర‌త్యేకంగా 500 సీసీ కెమేరాలు ఏర్పాటుతో పాటు.. ప్ర‌త్యేక కంట్రోల్ రూంను తాత్కాలికంగా ఏర్పాటు చేయ‌నున్నారు. ఇవాంకా భ‌ద్ర‌త కోసం ఒక మ‌హిళా ఐపీఎస్ అధికారిణిని నియ‌మించ‌నున్న‌ట్లు తెలిసింద‌. ఇవాంకా భ‌ద్ర‌త విష‌యంలో భారీ ఏర్పాట్ల‌ను చేస్తున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చూస్తే.. అమెరికా అధ్య‌క్షుడు వ‌స్తున్న‌ట్లే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News