ఇవాంకా హోట‌ల్‌ అడ్ర‌స్ మారింది

Update: 2017-11-27 10:32 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌పై మ‌రో కొత్త ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె న‌గ‌రంలోని వెస్టిన్ హోట‌ల్‌లో బ‌స చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె హోట‌ల్ అడ్ర‌స్ మారింది. ఆమె బ‌స వెస్టిన్ నుంచి ఇంకో చోటికి మార్చినట్లు తెలుస్తోంది. 28వ తేదీ తెల్ల‌వారుఝామున 100 మంది అమెరికా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో కలిసి ప్రత్యేక విమానంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్‌ హోటల్‌కు వెళ్లి అక్కడే బస చేస్తారని ముందుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇవాంక బస కోసం వెస్టిన్‌ హోటల్‌లో స్పెషల్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను అధికారులు సిద్ధం చేయ‌డ‌మే కాకుండా....ఆ సూట్‌కు అన్నివైపులా ఉన్న అద్దాలకు అదనంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దాలను ఏర్పాటు చేశారు. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఆ సూట్‌ను పరిశీలించిన అమెరికన్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే వెస్టిన్ తో పాటుగా మరో హోట‌ల్‌ను సైతం సిద్ధం చేశారు. రేపు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇవాంక చేరుకుని.. అటు నుంచి నేరుగా మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ట్రైడెంట్ హోటల్‌తో పాటు వెస్టిన్ హోటల్‌లో ఇవాంక బస చేసే అవకాశం ఉంది. అయితే ఏ హోట‌ల్‌లో ఆమె బ‌స చేస్తారో స్ప‌ష్ట‌త లేని నేప‌థ్యంలో...ఈ రెండు హోటళ్లల్లో యూఎస్‌ఐఎస్ బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. త‌దుప‌రి భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా బలగాలను భారీగా మోహరించారు. మ‌రోవైపు ఇవాంకాతో పాటు వస్తున్న అమెరికన్ డెలిగేట్లకు శంషాబాద్‌లోని నోవాటెల్, రాడిసన్‌ తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. వారంతా 28న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పారిశ్రామికవేత్తల సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటారు.

కాగా, వెస్టిన్ హోట‌ల్లో ఇవాంకా కోసం సిద్ధం చేసిన `స్పెషల్‌ ప్రెసిడెన్షియల్‌ సూట్‌`లో సాధారణ సమయంలో ఎవరైనా బస చేయాలంటే రోజుకు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మ‌రోవైపు భ‌ద్ర‌తాప‌ర‌మైచన చ‌ర్య‌ల్లో భాగంగా వెస్టిన్‌ హోటల్‌ పైభాగంతో పాటు చుట్టుపక్కల ఉన్న భవనాలపై అమెరికన్‌ సాయుధ సిబ్బంది ప్రత్యేక ఆయుధాలతో కాపలా కాస్తున్నారు. హోటల్‌ కింది భాగంలో ఇవాంక వాహనాలను ఆపడం కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.
Tags:    

Similar News