బాబు స్విస్ చాలెంజ్ పై ఐవైఆర్ కేసు షాక్‌!

Update: 2018-02-14 08:44 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు భారీ షాక్ త‌గిలింది. తానెంతో స‌న్నిహితంగా ఉన్న మాజీ కార్య‌ద‌ర్శి బాబు స‌ర్కారుపై కోర్టు ముందుకు రావ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌భుత్వ గుట్టుమ‌ట్లు తెలిసిన స్థానంలో ప‌ని చేసిన ముఖ్య అధికారి ఒక‌రు.. ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ఏపీ స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్విస్ చాలెంజ్ తీరుపై ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం వేశారు.

సుప్రీంకోర్టు మార్గ‌ద‌ర్శ‌కాలకు.. స్విస్ చాలెంజ్ విధానం విరుద్ధమ‌ని.. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ విరుద్ద‌మ‌ని.. దాన్ని నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్ర‌యించారు. ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం చ‌సిన స్విస్ చాలెంజ్ ఒప్పందంపై ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేసిన కృష్ణారావు త‌న పిటీష‌న్లో ఆస‌క్తిక‌ర అంశాల్ని ప్ర‌స్తావించారు.  బాబు స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానం సుప్రీం మార్గ‌ద‌ర్శ‌కాల‌కు విరుద్ధ‌మ‌ని చెప్ప‌ట‌మే కాదు.. అందుకు సాక్ష్యంగా ప‌లు అంశాల్ని పిటిష‌న్లో ఉద‌హ‌రించారు. త‌న వాద‌న‌కు సాక్ష్యంగా ప‌లు డాక్యుమెంట్ల‌ను కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్లుగా చెబుతున్నారు.

న‌వ్యాంధ్ర‌కు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వేళ ఐవైఆర్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించ‌టం.. అనంత‌రం వారి మ‌ధ్య విభేదాలు పొడ‌చూపిన నేప‌థ్యంలో.. తాజాగా కేసు వేయ‌టం బాబుకు రాజ‌కీయంగా ఇబ్బందేన‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. స్విస్ ఛాలెంజ్ కోసం ప్ర‌భుత్వం జారీ చేసిన జీవో 179ని నిలిపివేయాల‌ని హైకోర్టును కోర‌ట‌మేకాదు.. సీఆర్డీఏ ప్రాజెక్టు కేవ‌లం రియ‌ల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా ఐవైఆర్ అభివ‌ర్ణించారు. తాను ఆరోపించిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని చెప్పేందుకు వీలుగా ప‌లు ప‌త్రాల్ని స‌మ‌ర్పించిన‌ట్లుగా పేర్కొన్నారు.

అమ‌రావ‌తి అభివృద్ధి కోసం ఓపెన్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానం మేలైన‌ద‌ని.. ఆ విధానాన్నే ఏపీ స‌ర్కారు అనుస‌రించాల‌ని ఐవైఆర్ త‌న పిటిష‌న్లో కోరారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై ఇప్ప‌టికే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్ ఉండ‌గా.. తాజాగా ఐవైఆర్ పిటిష‌న్ ఇందుకు తోడైంద‌ని చెప్పాలి.

ఇదిలా ఉండ‌గా.. స్విస్ ఛాలెంజ్ ప‌ద్ధ‌తిలో సింగ‌పూర్ కు చెందిన అసెండాస్‌.. సింగ్ బ్రిడ్జ్‌.. సెంబ్ కార్ప్ అనే మూడు సంస్థ‌లు.. అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ తో క‌లిపి అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ మెంట్ పార్ట‌న‌ర్స్ అనే ఉమ్మ‌డి సంస్థ‌గా ఏర్ప‌డి మూడు ద‌శ‌ల్లో 15 ఏళ్ల‌లో అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించాలంటూ ఒక ఒప్పందాన్ని ఏపీ కేబినెట్ ఆమోదించింది. దీనిపై ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌తిపాద‌న కార‌ణంగా ఏపీకి తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని చెబుతున్నారు.

చెన్నైకి చెందిన ఎన్వీఎన్ ఇంజ‌నీర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ గ‌తంలో స్విస్ ఛాలెంజ్ పై కేసు దాఖ‌లు చేస్తూ సింగ‌పూర్ కంపెనీల‌కు లాభం క‌లిగేలా ప్ర‌భుత్వం రూల్స్ మార్చింద‌న్న ఆరోప‌ణ ఉంది. ఈ ఆరోప‌ణ‌పై కోర్టు స్పందిస్తూ.. నిబంధ‌న‌ల మేర‌కు ప‌ని చేయాల‌ని సూచ‌న చేసింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం త‌న తీరు మార్చుకోలేదంటూ ఐవైఆర్ తాజాగా పిటిష‌న్ దాఖ‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఐవైఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ఫిబ్ర‌వ‌రి 20న కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్భంగా మ‌రిన్ని ఆస‌క్తిక‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. ఐవైఆర్ పిటిష‌న్ బాబు స‌ర్కారుకు డ్యామేజ్ చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News