ఐవైఆర్ మ‌ళ్లీ ఫైర్‌!... బాబు నైజం ఇదే!

Update: 2017-10-16 10:12 GMT
ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్ ఐవైఆర్ కృష్ణారావు మ‌రో సారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు. `బాబు నైజం ఇంతే`  అంటూ కారాలు మిరియాలు నూరారు. గ‌తంలో ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణం, ఎంపిక విష‌యం స‌హా చంద్ర‌బాబు అవ‌లంబిస్తున్న తీరుపై ఫేస్‌ బుక్‌ లో చేసిన పోస్టుల ఫ‌లితంగా బాబు ఈయ‌న‌ను క‌నీసం స‌మాచారం కూడా అందించ‌కుండానే  బ్రాహ్మ‌ణ కార్పొరేషన్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించారు.  అప్పుడు కూడా ఐవైఆర్ వెనుక వైసీపీ అధినేత జ‌గ‌న్ ఉన్నార‌ని టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే, తాజాగా కూడా ఐవైఆర్ మ‌రోసారి బాబుపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు.

ఉద్యోగుల మ‌నోభావాల‌తో బాబు అడుకునే టైపు- అంటూ నిప్పులు చెరిగారు ఐవైఆర్‌.  కాపు కార్పొరేషన్‌ ఎండి  అమ‌రేంద‌ర్ ని ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఆయ‌న‌ను మాతృశాఖ‌కు పంపించారు. ఈ నేపృథ్యంలోనే ఐవైఆర్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశారు.  మీడియాకు లీకులు ఇచ్చి అధికారులను బదిలీ చేయడం చంద్రబాబు వ్యూహంలో భాగమని  పేర్కొన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తీసేలా బాబు వ్య‌వ‌హ‌రిస్తార‌ని అన్నారు. ఇప్పుడు కూడా ఇదే విధానంలో  బదిలీలు జరుగుతున్నాయని  ఆయన  వ్యాఖ్యానించారు.  కాపు కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన అమరేందర్‌ చాలా మంచి వ్యక్తి అని, ఆయనను ప్రభుత్వం కార్పొరేష‌న్ ఎండీ పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు.

 అయితే అమరేందర్‌ ఆ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, ఇప్పటికీ ప్రభుత్వంలోనే ఉన్నారని, అందుకే తాజా పరిణామాణలపై అమరేందర్‌ నోరు తెరవలేరన్నారు. చంద్రబాబు చెప్పింది చేయకపోతే ఇలాగే ప్రవర్తిస్తారంటూ ఐవైఆర్‌ మరోసారి ధ్వజమెత్తారు.  గ‌తంలోనూ ఐవైఆర్ ఇదే విధంగా బాబుపై కామెంట్లు కుమ్మ‌రించారు. అమ‌రావ‌తిలోనూ ప్ర‌భుత్వంలోనూ జ‌రుగుతున్న‌ది ఒక‌టైతే.. పైకి మాత్రం మ‌రొక‌టి ప్ర‌చారంలోకి తీసుకువ‌స్తార‌ని, బాబుకు జేజేలు కొట్టేవారంటే భ‌లే ముద్ద‌ని గ‌తంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇదే పాయింట్‌పై బాబును ఐవైఆర్ ఏకేశారు. మ‌రి దీనికి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి కౌంట‌ర్ వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News