ఆయన సవాళ్లను ఎవరైనా పట్టించుకుంటారా?

Update: 2018-02-12 07:28 GMT
రాజకీయాల్లో సవాళ్లకు ప్రతిసవాళ్లకు విలువ లేకుండా పోతోంది. ఎంత కొమ్ములు తిరిగిన నాయకులైనా సరే.. బహిరంగ వేదికల మీద సవాళ్ల మీద సవాళ్లు విసరడం.. ఆ తర్వాత.. గుట్టు చప్పుడు కాకుండా వాటి సంగతి మరచిపోవడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. ఇలాంటిది ప్రజలకు అలవాటు అయిపోతున్న ఈ రోజుల్లో.. ఏమో ఎవరైనా నాయకులు నికార్సుగా సవాలు విసిరినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది.

సదరు మంత్రిగారు.. నల్గొండ లో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బొడ్డుపల్లికి ఆప్తుడైన కోమటిరెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డికి ఊపిరి ఆడనివ్వకుండా వరుస విమర్శలతో చికాకు పెట్టేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగదీష్ రెడ్డి ఓ తిరుగులేని సవాలు విసిరారు. నల్గొండ జిల్లాలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా గెలిచే చాన్సే లేదని. వచ్చే ఎన్నికల్లో జల్లాలో ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కూడా.. తాను అసెంబ్లీలో అడుగు పెట్టబోనని.. ఆయన సవాలు విసిరారు. నిజానికి ఇది తీవ్రమైన సవాలే. కొన్ని సర్వేలు తెలంగాణలో బలాబలాలు దాదాపుగా సమానంగా ఉన్నాయని అంచనా వేసే నేపథ్యంలో - తెరాస హవా బీభత్సంగా ఉన్న గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ కు అంతో ఇంతో పట్టం కట్టిన నల్గొండ జిల్లాలో ఈసారి వారికి ఒక్కసీటు కూడా రాదని సవాలు విసరడానికి చాలా తెగువ ఉండాలి.

అయితే జగదీష్ రెడ్డి సవాలైతే విసిరారు గానీ.. దాన్ని నిలబెట్టుకుంటారా... లేదా అనేది మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ మాటకొస్తే.. కేటీఆర్ విసిరిన సవాళ్లకే పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి తూచ్ అనేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని బహిరంగ వేదిక మీద మాట ఇచ్చి, తప్పిన చరిత్ర కేసీఆర్ ది అని.. అలాంటి ఫ్యామిలీ వారసుడు చేసే సవాళ్లను ఎలా నమ్మగలం అని.. ఆయన కేటీఆర్ సవాళ్లను ఈసడించేశారు. తెరాసలో సుప్రీం లెవల్లో ఉన్న తండ్రీ కొడుకుల సవాళ్లకే విలువ లేకుండా పోతున్నప్పుడు.. ఇక మంత్రివర్గంలో ఒకడైన జగదీష్ రెడ్డి సవాలుకు విలువ ఉంటుందా? ఆయన మాటకు కట్టుబడి ఉంటాడని.. ప్రజలు సీరియస్ గా నమ్మగలరా అని జనం తర్కించుకుంటున్నారు.
Tags:    

Similar News