కేసీఆర్ ఇబ్బందిప‌డ్డ స‌మ‌స్య‌తోనే జ‌గ‌న్ కూడా టార్గెట్ అయ్యారు

Update: 2022-02-07 17:30 GMT
తెలంగాణ సీఎం కే చంద్ర‌శేఖ‌ర్ రావు , ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్వ‌ల్ప‌కాలంలోనే ఒకే ర‌క‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కున్నార‌ని రాజ‌కీయవ‌ర్గాలు అంటున్నాయి. మిగ‌తా వారికంటే ఒకే వ‌ర్గం నుంచి ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు టార్గెట్ అయ్యార‌ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదంతా ఉద్యోగుల ఆందోళ‌న గురించి అందులోనూ ప్ర‌ధానంగా టీచ‌ర్ల నిర‌స‌న గురించి.

ఏపీలో ఉద్యోగుల‌కు పీఆర్సీ విష‌యం చిలికిచిలికి గాలివాన‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఉద్యోగుల ఆందోళన, అనంత‌రం ఛ‌లో విజయవాడ ద్వారా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి ఒకింత ఘాటుగానే తెలియ‌జేశారు. అనంత‌రం పీఆర్సీ సాధ‌న స‌మితి, ప్ర‌భుత్వం మ‌ధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. ప్ర‌భుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప‌లు సంఘాలు ఏకంగా జేఏసీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డాయి. త‌మ పోరాటాన్ని కొన‌సాగిస్తామ‌ని ప్ర‌క‌టించాయి.

మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ఏం చర్చించిందో అర్థం కావడం లేదని  ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అశుతోష్ మిశ్రా రిపోర్టు చూపించలేదని, నూతన పీఆర్సీ జీవోలు రద్దు చేయలేదని పేర్కొంటూ మరి ఏ విధంగా ఉద్యోగ సంఘాలు తృప్తి చెందాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. రూ.11,500 కోట్ల భారం అంటూ సాకులు చెప్తున్న ఏపీ ప్రభుత్వంతో పోరాడటంలో స్టీరింగ్ కమిటీ వైఫల్యం చెందిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రలోభాలకు స్టీరింగ్ కమిటీ నాయకులు లొంగిపోయి ఉద్యమానికి తీవ్ర అన్యాయం చేశారని అయితే, తాము మాత్రం ఆందోళనలు కొనసాగిస్తామని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. తమతో కలిసి వచ్చే సంఘాలతో నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పింది.

కాగా, తెలంగాణ‌లో ఉద్యోగుల బ‌దిలీ ప్ర‌క్రియ స‌మ‌యంలో టీచ‌ర్లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఉద్యోగుల్లోని మిగ‌తా వ‌ర్గాల కంటే టీచ‌ర్లే త‌మ క్షేత్ర‌స్థాయి ప్రాంతాల నుంచి మొద‌లుకొని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర‌కు నిర‌స‌న‌లు తెలిపారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌ట్టారు. ఇప్పుడు ఏపీలో కూడా సీఎం జ‌గ‌న్ టీచ‌ర్ల నుంచి నిర‌స‌న‌లు ఎదుర్కుంటున్నార‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

    
    
    

Tags:    

Similar News