బాబు మెప్పించ‌లేదు...జ‌గ‌న్ న‌చ్చ‌ట్లేదు

Update: 2017-10-18 15:30 GMT
ఔను ఇది ఏపీ రాజ‌కీయాల్లోని నేత‌ల్లో అభిప్రాయం. ముఖ్య‌మంత్రిగా ఉన్న సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌ - అనుభ‌వ‌జ్ఞుడు అయిన చంద్ర‌బాబు న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ ప‌రిపాల‌కుడిగా అంద‌రి మ‌న్న‌న‌లు పొంద‌లేకపోతున్నారట‌. అదే స‌మ‌యంలో విప‌క్ష నేత‌గా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సైతం అదే ర్యాంకింగ్‌ ను క‌లిగి ఉండి స‌రైన నాయ‌కుడు అనే భావ‌న‌ను పొంద‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. హామీల అమ‌లు విష‌యంలో...ఆశించిన ఫలితాలు సాధించే క్ర‌మంలో బాబు తీరు అంచ‌నాల‌కు త‌గిన స్థాయిలో లేక‌పోగా...అస్ప‌ష్ట‌మైన రాజ‌కీయ ప్ర‌యాణం - అధికార కాంక్ష అనే కార‌ణంగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన లేక‌పోతున్నార‌ని చెప్తున్నారు.

రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం బాబు ప్ర‌చారమే ఆయ‌న‌కు వైఫ‌ల్యంగా మారింద‌ని చెప్పుకోవ‌చ్చు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో తాను స‌మ‌ర్థ‌వంత‌మైన - అద్భుత‌మైన ప‌రిపాల‌న అందిస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. విద్య‌ - వైద్యం - అభివృద్ధి ప‌రిశ్ర‌మ‌లు - ఉద్యోగాల క‌ల్ప‌న స‌హా అన్నింటిలో న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ ను నంబర్ వ‌న్ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే ఆచ‌ర‌ణ‌లో అది వైఫ‌ల్యం చెందింది. అద్భుత‌మైన రాజ‌ధానిగా అమ‌రావ‌తి నిర్మిస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ....అది ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌లేదు. ఇంకా డిజైన్ల ద‌శ‌లోనే అమ‌రావ‌తి ఉండిపోవ‌టాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుగా పేర్కొన్న అమ‌రావ‌తి కాస్త‌...ఇంకా ఊరిస్తూనే ఉండ‌టం బాబు వైఫ‌ల్యాల జాబితాలో చేర్చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుగా ప్ర‌చారం చేసుకున్న పోల‌వ‌రం నిర్మాణం కాలేదు. కేంద్రం కొర్రీలు పెట్ట‌డంతో ఈ ప్రాజెక్టు భ‌విష్య‌త్తుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఇక ప్ర‌చారం చేసినంత స్థాయిలో ప‌రిశ్ర‌మ‌లు రాలేదు - ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌లేదు. మ‌రోవైపు ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌క‌పోవ‌డం - నిరుద్యోగుల భృతి విడుద‌ల కాక‌పోవ‌డంతో...వారిలోనూ అసంతృప్తి ఉంది. వెర‌సీ...త‌ను అద్భుతంగా నిర్మించిన హైద‌రాబాద్‌ ను - అక్క‌డి అభివృద్ధిని అంతా న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ కు తెచ్చేస్తాన‌ని బాబు చేసిన ప్ర‌క‌ట‌నలు ఆశించిన స్థాయికి భిన్నంగా ఉండ‌టంతో ఆయ‌న స‌త్తాపై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ విష‌యంలోనూ సీనియ‌ర్లు పెద‌వి విరుస్తున్నారు. వైఎస్ జ‌గ‌న్‌ కు తాను ముఖ్య‌మంత్రి అయిపోవాల‌నే ప‌దవీ కాంక్ష‌ - ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడును విమ‌ర్శించాల‌నే భావ‌న త‌ప్ప మ‌రొక‌టి ప‌ట్ట‌ట్లేద‌నే విమ‌ర్శిస్తున్న వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉందని అంటున్నారు. లీడ‌ర్ల‌ను న‌మ్ముకొని క్యాడ‌ర్ ను ప‌ట్టించుకోకపోవ‌డం వైసీపీ బ‌ల‌హీన‌త అని అంటున్నారు. గెలుపుపై విప‌రీత‌మైన న‌మ్మ‌కం - అందుకు త‌గిన కార్యాచ‌ర‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా వైసీపీ దిగాలు ప‌డిపోవ‌డానికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. ఇటీవ‌ల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని చెప్తున్నారు. స‌రైన క‌స‌ర‌త్తు లేకుండా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం....ఆచ‌ర‌ణ‌లో వాటిని నిల‌బెట్టుకోలేక‌పోవడం కూడా మ‌రో స‌మ‌స్య‌గా చెప్తున్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఎంపీల‌ల‌తో రాజీనామా చేస్తాన‌ని జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇందుకు స‌రైన ఉదాహ‌ర‌ణ అంటున్నారు. హోదా కోసం త‌న ఎంపీలు రాజీనామా చేస్తార‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌...అనంత‌రం దాన్ని నిలుపుకోలేక‌పోయార‌ని త‌ద్వారా త‌మ‌ను న‌డిపించే లీడ‌ర్ స‌రైన దారిలోనే ఉన్నారనే భావ‌న క‌లిగించ‌లేక‌పోయారని అంటున్నారు.  ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌క‌పోవ‌డం - నిర్మాణాత్మ‌క‌మైన పోరాట రీతి లేక‌పోవ‌డం వ‌ల్లే పార్టీ నేత‌ల్లో స్థైర్యం నింప‌లేక‌పోతున్నార‌ని అందుకు తాజాగా పార్టీ ఫిరాయిస్తున్న నేత‌లు నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు.  జ‌గ‌న్ మ‌రింత ప‌క‌డ్బందీగా ముందుకు సాగితే...వైసీపీ బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేషిస్తున్నారు.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి - సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు చింతామోహ‌న్ ఇదే అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. స‌రైన నాయ‌కుడు ఎవ‌రు అనేదానికి త‌న‌వ‌ద్ద స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేక‌పోయిన‌ప్ప‌టికీ...నిజాయితి - క‌లుపుగోలుత‌నం - ప్ర‌జ‌ల కోసం పాటుప‌డే నాయ‌కుడిగా ఉన్న వ్య‌క్తి కోసం ఏపీ వాసులు ఆకాంక్షిస్తున్న‌ట్లు ఓ మీడియా సంస్థ‌తో వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News