ఎమ్మెల్సీ టికెట్‌పై జ‌గ‌న్ మ‌డ‌త‌పేచీ.. ఏం చెప్పారంటే!

Update: 2022-10-27 12:30 GMT
టెక్కలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ఆయన్ను గెలిపించుకు రావాలి అని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టెక్కలి నియోజకవర్గ  నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చెప్పారు. అయితే వారిలో కొంతమంది ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 'శ్రీనివాస్‌ అయితే గెలవడం కష్టం. ఆయన పార్టీలో ఎవరినీ కలుపుకొని వెళ్లరు. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారు కూడా' అని సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

దీనికి సీఎం స్పందిస్తూ.. 'కుటుంబం అన్నాక ఇలాంటివి సహజం. కులాలు, కుమ్ములాటలన్నీ పక్కన పెట్టి, అందరూ కలిసి పనిచేసి శ్రీనును గెలిపించుకు రండి. మీ అందరికీ తగిన న్యాయం జరుగుతుంది' అని అన్నట్లు తెలిసింది. ఇప్పటి వరకూ జరిగిన నియోజకవర్గాల భేటీలన్నింటి కంటే సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం జరగడం గమనార్హం.
 
ఇదే స‌మ‌యంలో కీల‌క నేత పేరాడ తిల‌క్‌.. త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి కావాల‌ని జ‌గ‌న్‌ను కోరారు. అయితే.. దువ్వాడ శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించుకు వస్తే ఆయన ఎమ్మెల్సీ పదవిని నీకు ఇస్తా. మీరంతా కలిసి పని చేయకపోవడం వల్ల శ్రీను ఓడిపోతే, ఆయన ఎమ్మెల్సీ పదవి కొనసాగించాలంటాడు.

కాబట్టి నీకు ఎమ్మెల్సీ పదవి కావాలనుకుంటే శ్రీనును ఎమ్మెల్యేను చెయ్ అని  పేరాడ తిలక్‌కు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నియోజకవర్గ టికెట్‌ ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా సమావేశంలో పాల్గొన్నారు.

దువ్వాడకు మద్దతివ్వాలని ఆమెకు కూడా సీఎం చెప్పారు. గ్రూపులు, కుమ్ములాటలు ఉన్నప్పుడు తనకు టికెట్‌ వస్తుందా రాదా అన్న అభద్రతా భావన ఉంటుందనే శ్రీనివాస్‌ పేరును ఇప్పుడే ఖరారు చేశాను.. మీరంతా ఆయనకు మద్దతివ్వాలని జగన్‌ స్పష్టం చేశారట‌. అంతేకాదు.. 'టెక్కలి నాకు ప్రతిష్ఠాత్మకం. అక్కడున్నది టీడీపీ ఎమ్మెల్యే.

ఇప్పటికే ఆ నియోజకవర్గంలో 136లో 119 పంచాయతీలను, 78కి 74 ఎంపీటీసీ స్థానాలను, 4కి 4 ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను గెలిచాం. అక్కడ మార్పు ఇంత స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవాలి అని సీఎం దిశానిర్దేశం చేశారు. మ‌రి నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News