ఖర్మ ఖర్మ : జగన్... బాబూ ఇద్దరూ అంతేనా...?

Update: 2022-12-01 11:40 GMT
ఖర్మ ఖర్మ అని ఎంతో బాధ వస్తే తప్ప జనాలు అనుకోరు. ఖర్మ అంటే అది నెగిటివ్ గా తోస్తుంది. అందుకే ఎవరూ తెలిసి తెలిసి దాని జోలికి కూడా పోరు. కానీ గుజరాత్ కి చెందిన రాబిన్ శర్మ టీడీపీ వ్యూహకర్తగా మారిన తరువాత ఈ ఖర్మ కాస్తా ఏపీ రాజకీయాల్లో ఊతపదంగా  మారుమోగుతోంది. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అన్న పేరిట భారీ ప్రోగ్రాం ని రాబిన్ శర్మ టీడీపీ కోసం డిజైన్ చేశారు. జనాలు అలా అనుకోవాలని తమ మాట వారి నోట పలకాలని అది వ్యతిరేకత మారి వెల్లువై పసుపు పార్టీ ఏపీలో రెపరెపలాడాలని రాబిన్ శర్మ స్ట్రాటజీ.

ఆ వ్యూహం మహా బాగా నచ్చేసి చంద్రబాబు ఏపీ అంతా ఇదేమి ఖర్మ అంటూ ఊతపదంగా చేసుకుని చుట్టేస్తున్నారు. దీనికి ముందు వారం క్రితమే ఇదేమి ఖర్మ పేరిట టీడీపీ కార్యక్రమం రెడీ చేస్తోందని మీడియాలో రావడంతో సీఎం జగన్ దాన్ని అందిపుచ్చుకున్నారు. ఆయన జిల్లాలలో తాను పాల్గొనే సభలలో మాట్లాడుతున్నప్పుడు ఇదేమి ఖర్మ బాబూ అంటూ టీడీపీని చంద్రబాబుని కోట్ చేస్తూ విమర్శలు సంధిస్తున్నారు.

ఆ విధంగా ఇదేమి ఖర్మ అన్న కార్యక్రమాన్ని వైసీపీ తనకు అనువుగా మార్చుకుంటోంది. ఇక చూస్తే  డిసెంబర్ ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీకి ఇది రెండు నెలల పాటు సుదీర్ఘమైన నిరసన కార్యక్రమం.చేపట్టడంతో
రోజుకు వందల సార్లు ఇదేమి ఖర్మ అనుకుంటూ తమ్ముళ్ళు ఏపీ అంతా తిరుగుతున్నారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులోని విజయరాయి వద్ద ప్రారంభించిన చంద్రబాబు అక్కడ జరిగిన  రోడ్ షోలో సుదీర్ఘమైన ప్రసంగం చేశారు.

ఆయన వైసీపీ ఏలుబడిని జగన్ పాలనను విమర్శిస్తున్న ప్రతీ సారి చివరిలో ఇదేమి ఖర్మ అంటూ తారకమంత్రంగా జపించేశారు. అలా బాబు స్పీచ్ అయ్యేనాటికి కనీసం మూడు పదుల సార్లు అయినా ఇదేమి ఖర్మ అంటూ బాబు నొచ్చుకుని  నొసలు చిట్లించుకుని తల పట్టుకుని ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. జగన్ సరే సరి ఆయన మీటింగులలో బాబుని విమర్శిస్తే తప్ప నిద్రపోరు. దాంతో ఆయన కూడా ఖర్మ ఖర్మ అనుకుంటూ బాబుని టార్గెట్ చేస్తున్నారు.

ఇక వైసీపీలో టీడీపీలో ఉన్న ఇతర నాయకులు సైతం ఇపుడు కొత్తగా తాము చేసే విమర్శలకు ఇదేమి ఖర్మ అంటూ జోడిస్తూ అల్లల్లాడిస్తున్నారు. మొత్తానికి చూస్తే రాబిన్ శర్మ వ్యూహం కాదు కానీ ఏపీ రాజకీయాలు ఇదేమి ఖర్మరా బాబు అని అనుకున్నట్లుగా నేతాశ్రీలు చేస్తున్నారు అని అంటున్నారు.

శుభం పలకరా పెళ్ళికొడకా అని అంటే మరేదో అశుభం పలికాడని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు ఏపీలో రాజకీయ పార్టీల తీరు అలాగే ఉంది అంటున్నారు.  శుభంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీలు ప్రతి నిత్యం  ఖర్మ ఖర్మ అంటూ అశుభం పలుకుతూ సభలు నిర్వహిస్తే వచ్చిన జనాలు కూడా ఇదంతా మా ఖర్మ అనుకుని రివర్స్ అయితే అపుడు కదా రాజకీయం రంగు తేలేది అన్న సెటైర్లు పడుతున్నాయి.

ఇక మీడియాతో పాటు ఇతర మాధ్యమాలకు కూడా ఇదేమి ఖర్మ అంటూ రాసుకోవడం అంటే ఖర్మ కాక మరేమిటి అన్న వారూ ఉన్నారు. సో కర్మ లీడ్స్ ఖర్మ. మరి ఎవరి ఖర్మ ఎలా ఉందో. ఏ కర్మ చేస్తే ఈ ఖర్మ పడుతుందో రాజకీయ వేదాంతులు ఎవరైనా చెప్పాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News