జగన్ క్లారిటీ : రాజకీయాలు చేయను.. వారిని వదలను...?

Update: 2022-05-16 07:55 GMT
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో ఒక విషయం కచ్చితంగా క్లారిటీకి వచ్చింది. ఆయన వచ్చే ఎన్నికల కోసం దూకుడుగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యర్ధులను పసిగట్టి వారి మీద ఇప్పటి నుంచే బాంబులు వేస్తున్నారు. జనాల్లో వారిని పలుచన చేసే కార్యక్రమాన్ని కూడా ఎంచుకున్నారు. గత రెండు నెలలుగా చూస్తే జిల్లా టూర్లలో జగన్ బిజీగా ఉన్నారు.

ఈ టూర్ల సందర్భంగా ఆయన జనాలకు ఒక్కటే చెబుతున్నారు. తాను రాజకీయాలు చేయడంలేదని, తాను ఏది చెబితే అదే చస్తానని, తన చిత్తశుద్ధి నిబద్ధతను గురించి ఆలోచించాలని కోరుతున్నారు. అంతే కాదు తన పాలనతో అయిదేళ్ల చంద్రబాబు పాలనను కూడా తేడాను గమనించాలని విన్నవిస్తున్నారు.

ఇక మరో కొత్త లాజిక్ పాయింట్ ని కూడా జగన్ బయటకు తీస్తున్నారు. నాడు చంద్రబాబు హయాంలో అనేక వర్గాలు ఇబ్బందులు పడితే ప్రజా సమస్యల మీద ఆయన అనుకూల మీడియా ఎందుకు రాయలేదని, ఇపుడు తన పాలన మీద ఎందుకు రంద్రాన్వేషణ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

బాబు ఏం చేసినా ఆఖరుకు ఎన్నికల మానిఫేస్టోని చెత్త బుట్టలో పడేసినా కిమ్మనని ఆయన అనుకూల మీడియా ఈ రోజు  దుష్ట చతుష్టయంగా మారి ఇపుడు తన ప్రభుత్వం మీద అదే పనిగా బురద జల్లుతోందని జగన్ అంటున్నారు. దాని వెనక ఉన్న వారి ఆకాంక్షలను, స్వార్ధ  ప్రయోజనాలను అర్ధం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ని పేరెత్తకుండానే  బాబుకు ఆయన దత్తపుత్రుడు అంటూ జగన్  చేస్తున్న విమర్శలలో వేడిని పెంచేస్తున్నారు. ప్రశ్నిస్తాను అని చెబుతూ వచ్చిన పవన్ రైతుల రుణ మాఫీని నాడు చంద్రబాబు అమలు చేయకపోతే ఎందుకు ప్రశ్నించలేదని కూడా జగన్ నిలదీస్తున్నారు.

అంటే వీరంతా ఒక్కటే చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అన్న సందేశాన్ని జనాల్లోకి పంపించడం ద్వారా వారి విమర్శలకు ఏ మాత్రం విలువ లేదని జగన్ చెప్పాలని చూస్తున్నారు. ఇక తనకు రాజకీయల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని జగన్ అంటున్నారు. తాను ఎన్నికల గురించి చూడనని, ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాను అని ఆయన చెబుతున్నారు.

మొత్తానికి జగన్ చెబుతున్నాది ఒక్కటే. తాను చిత్తశుద్ధితో ఉన్నాను, తనది నిజయతీ పాలన, అదే టైమ్ లో ప్రత్యర్ధులు మాత్రం తన మీద అనవసర విమర్శలు చేస్తున్నారు. వీటిని గమంచించి ప్రజలు వైసీపీకి మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. ఇక జగన్ ఏ సభకు వెళ్ళినా చంద్రబాబు పవన్ లను మాత్రం వదలను అని చెప్పకనే చెబుతున్నారు. మొత్తానికి జగన్ వైఖరి చూస్తూంటే ఎన్నికల యుద్ధానికి తెర తీశారు. ప్రత్యర్ధుల మీద వాడిగా వేడిగా విమర్శలు చేస్తున్నారు. మరి వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
Tags:    

Similar News