చాలెంజ్ అంటే ఒకేవైపు నుంచి చేస్తారా?

Update: 2017-03-24 13:46 GMT
ఏపీ అసెంబ్లీ నిర్వ‌హ‌ణపై ప్రతిపక్ష నేత - వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన స‌మ‌యంలో, సభ కొద్ది స‌మ‌యం వాయిదా ప‌డిన‌పుడు జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రాకుండా సభలో తమ గొంతు నొక్కుతున్నారని అన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆధారాలను సభముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుంటే...తన ప్రయత్నాన్ని అధికారపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారన్నారు.

సభలో పుల్లారావు భూముల కొనుగోలుపై తాను ఆధారాలు ప్రవేశపెట్టాక, తర్వాత వాళ్ల దగ్గర గొప్ప ఆధారాలుంటే సభలో ఇవ్వొచ్చని జ‌గ‌న్ అన్నారు. ఇద్దరి వాదనలు విన్నాక తప్పెవరిదో ప్రజలే నిర్ణయిస్తారని జగన్ చెప్పారు. అయితే ఆ అవకాశాన్ని స్పీకర్‌ తమకు ఇవ్వడం లేదని...నీటి కుళాయిల దగ్గర సవాళ్ల మాదిరిగా విసురుతున్న సవాళ్లకు అర్థం లేదని అన్నారు. ఇదే సభలో గతంలో తాను విసిరిన సవాల్‌కు ప్రభుత్వం పారిపోయిందని జగన్‌ అన్నారు. తనపై కేసులకు సంబంధించి విసిరిన సవాల్‌కు ప్రభుత్వం నోరు విప్పలేదన్న విషయాన్ని జ‌గ‌న్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాలు బయటకు వస్తే మంత్రి పుల్లారావు సహా అధికార పార్టీ నేతల బండారం బయటపడుతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తే మైక్‌ కట్‌ చేస్తున్నారన్నారు. సభను ముందుకు తీసుకెళ్లాల్సిన స్పీకర్‌ ఆ పని చేయడం లేదని, సభ విలువలను, గౌరవాన్ని దిగజార్చుతున్నారని జగన్‌ అన్నారు.

సభలో ఒక్క ఛాలెంజ్ కే రూలింగ్‌ ఇస్తారా, తమ ఛాలెంజ్‌లపై రూలింగ్‌ ఇవ్వరా అని జ‌గ‌న్ ప్రశ్నించారు. దేనికైనా ధర్మం, న్యాయం ఉండాలని  వ్యాఖ్యానించారు. పార్టీ మారిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్‌ విసిరామని, కానీ స్పీకర్‌ ను అడ్డం పెట్టుకుని అనర్హత వేటు పడకుండా చూస్తున్నారని జగన్‌ అన్నారు. చంద్రబాబు-కాంగ్రెస్‌ పార్టీ కలిసి తనపై తప్పుడు కేసులు వేయించారని, అందుకే అవిశ్వాసం సమయంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కార్‌ను చంద్రబాబు కాపాడారని జగన్‌ వ్యాఖ్యానించారు. తన ఆస్తి లక్ష కోట్లు అని ఒకసారి, రూ.43వేల కోట్లని మరోసారి చెబుతున్నారని, అందులో 10శాతం ఇవ్వాలని తాను సవాల్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయిందని జ‌గ‌న్‌ ఎద్దేవా చేశారు. తన సవాళ్లపై స్పందించేందుకు ఇంతవరకూ ఒక్కరు కూడా ముందుకు రాలేదన్నారు. మళ్లీ అవే ఆరోపణలు తనపై చేస్తున్నారని జగన్‌ అన్నారు. ఓటుకు కోట్లు కేసులో మనవాళ్లు బ్రీఫ్‌ డ్‌ మి అనే వాయిస్‌ చంద్రబాబుది అవునో కాదో చెప్పాలని సవాల్‌ విసిరితే ఇప్పటివరకూ స్పందన లేదని జ‌గ‌న్ గుర్తు చేశారు.  ప్రతిపక్షం సవాళ్లపై స్పందించరని, అదే అధికారపక్షం సవాల్‌ పై మాత్రం స్పందించాలని ఎదురు దాడి చేయడం సరికాదని వైఎస్‌ జగన్‌ అన్నారు. చాలెంజ్ అంటేనే కొత్త భాష్యం చెప్పిన ఘ‌న‌త అధికార పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News