జంప్ జిలానీల‌కు ప‌ద‌వులు..జ‌గ‌న్ కామెంట్

Update: 2017-03-31 17:12 GMT
న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ లో తొట్టతొలి అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. ఇవి విజ‌య‌వంతం అయ్యాయా? ప‌్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార దిశ‌లో సాగాయా అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వేర్వేరుగా ఉంటాయ‌నేది తెలిసిందే. అయితే అసెంబ్లీ సాగిన తీరుపై ఏపీ ప్రతిపక్ష నేత - వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. ప్రజాసమస్యలు - ప్రభుత్వ అక్రమాలపై తాము చర్చకు పట్టుబడితే సమాధానం చెప్పలేక ప్రభుత్వం సభను వాయిదా వేసుకొని పారిపోయిందని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం వైయస్ జగన్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. ఈ స‌మావేశాలు మొత్తం అప్రజాస్వామికంగానే జరిగిందని తెలిపారు.

సభలో పార్టీ మారిన వారిని అధికారపక్షంవైపు కూర్చోబెట్టి ప్రజాస్వామ్య‌ విలువలను దిగజార్చారని ప్రభుత్వంపై జ‌గ‌న్‌ ధ్వజమెత్తారు. పార్టీ మారిన వారికి మంత్రి పదవులిచ్చేందుకు సీఎం సిద్ధ‌మ‌య్యార‌ని వార్త‌లు వ‌స్తున్నాయ‌ని ప‌లువురు మీడియా మిత్రులు ప్ర‌స్తావించ‌గా... అలా ప‌ద‌వులు పొందిన వారికి, ప‌ద‌వులు ఇచ్చిన వారికి ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని జ‌గ‌న్ హెచ్చరించారు. కాగా, ప్రజాసమస్యలపై తాము మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మైక్ కట్ చేశారని, అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు ఆనందించారని జ‌గ‌న్‌ ఫైర్ అయ్యారు. ఎప్పటిలానే తనపై వ్యక్తిగత ఆరోపణలకు దిగారని దుయ్యబట్టారు.

సభలో మేం విసిరిన ఏ సవాల్ ను బాబు స్వీకరించలేదని జ‌గ‌న్‌ అన్నారు. అగ్రీగోల్డ్, పేపర్ లీక్ , ఆక్వా తదితర అంశాలపై తాము చర్చకు పట్టుబడితే వాయిదాలతో కాలక్షేపం చేశారని తూర్పారబట్టారు. ప్రత్యేకహోదాపై తీర్మానం అడిగితే ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశామన్నారు. అదేవిధంగా నారాయణ స్కూళ్లో పదవ తరగతి పేపర్ లీకేజీ స్కాంపైనా సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశామని జ‌గ‌న్ అన్నారు. ఏ అంశంపై కూడ ప్రభుత్వం విచారణకు అంగీకరించలేదన్నారు. తమకు ప్రజాసమస్యల పరిష్కారమే ముఖ్యమని వైయస్ జగన్ స్పష్టం చేశారు. అధికారపక్షానికి జగనే ఓ సమస్య అని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News